ఇన్​స్పిరేషన్..డ్రాపవుట్‌‌‌‌ నుంచి..కుబేరుడిగా..

ఇన్​స్పిరేషన్..డ్రాపవుట్‌‌‌‌ నుంచి..కుబేరుడిగా..

ఒక కాలేజీ డ్రాపవుట్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌.. కష్టపడి ఓ కంపెనీ పెట్టాడు. వెయ్యి డాలర్లతో మొదలైన ఆ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. అదే ‘డెల్‌‌‌‌’ కంపెనీ. దీని వ్యవస్థాపకుడు మైఖేల్‌‌‌‌ డెల్‌‌‌‌. మైఖేల్‌‌‌‌కి చిన్నప్పటినుంచి బిజినెస్‌‌‌‌ చేయాలనే ఆలోచన బలంగా ఉండేది. కానీ.. తల్లిదండ్రులు అతన్ని ఒక డాక్టర్‌‌‌‌‌‌‌‌గా చూడాలనుకున్నారు. అందుకని మెడిసిన్ కోర్సులో చేరాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చిన్నగా బిజినెస్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. అందులో సక్సెస్‌‌‌‌ కావడంతో కాలేజీకి వెళ్లడం మానేశాడు. కట్‌‌‌‌ చేస్తే.. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 28వ స్థానంలో నిలిచాడు మైఖేల్‌‌‌‌.

మైఖేల్ డెల్1965 ఫిబ్రవరి 23న అమెరికాలోని హూస్టన్‌‌‌‌లో ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు లోరైన్ షార్లెట్, అలెగ్జాండర్ డెల్. హూస్టన్‌‌‌‌లోని హెరోడ్ ఎలిమెంటరీ స్కూల్‌‌‌‌లో చదివాడు. తల్లి స్టాక్ బ్రోకర్‌‌‌‌, తండ్రి ఆర్దోడాంటిస్ట్‌‌‌‌. మైఖేల్​కు బాల్యం నుంచి బిజినెస్‌‌‌‌ చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే తొందరగా చదువు పూర్తిచేసి,  స్టార్టప్‌‌‌‌ ఏదైనా పెట్టాలి అనుకున్నాడు. దాంతో వయసుకు మించిన చదువుని ఎంచుకున్నాడు. ఎనిమిదేండ్ల వయసులోనే హై స్కూల్‌‌‌‌కు సమానమైన ఎగ్జామ్‌‌‌‌ ఒకటి రాసేందుకు అప్లికేషన్​ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మెమోరియల్ హై స్కూల్‌‌‌‌లో చదివాడు. టీనేజ్‌‌‌‌నుంచే సంపాదన మొదలుపెట్టాడు. అందుకోసం పలురకాల పార్ట్‌‌‌‌ టైం జాబ్స్‌‌‌‌ చేసేవాడు. అలా వచ్చిన డబ్బుని వేస్ట్​గా ఖర్చు చేయకుండా విలువైన మెటల్స్‌‌‌‌, స్టాక్ మార్కెట్‌‌‌‌లో పెట్టుబడిగా పెట్టాడు. 

టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్‌‌‌‌తో...

మైఖేల్‌‌‌‌కు టెక్నాలజీ మీద చిన్నప్పటినుంచే ఇంట్రెస్ట్‌‌‌‌ ఉండేది. అందుకే ఏడేండ్ల వయసులోనే మొదటి కాలిక్యులేటర్‌‌‌‌ కొన్నాడు. పదిహేనేండ్ల వయసులో మొదటిసారి కంప్యూటర్‌‌‌‌‌‌‌‌తో ఆడుకున్నాడు. ఆ తర్వాత అతనికి కంప్యూటర్ మీద ఇష్టం పెరిగింది. పందొమ్మిదేండ్ల వయసులోనే తన మొదటి కంప్యూటర్ యాపిల్‌‌‌‌–2 కొనుక్కున్నాడు. అదెలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని పూర్తిగా విడదీసి, మళ్లీ బిగించాడు. ఆ తర్వాత మైఖేల్‌‌‌‌కు టెక్నాలజీ మీద బాగా ఇంట్రెస్ట్‌‌‌‌ పెరిగింది. కానీ... అమ్మానాన్న మాత్రం మైఖేల్‌‌‌‌ని డాక్టర్‌‌‌‌‌‌‌‌ని చేయాలి అనుకున్నారు.

అందుకే వాళ్ల సంతోషం కోసం 1983లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌‌‌‌లో ప్రి–మెడ్‌‌‌‌లో చేరాడు. చదువుకుంటున్నప్పుడు కూడా ఏదోలా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో ఉండేవాడు. దాంతో ఖాళీ టైంలో హూస్టన్ పోస్ట్‌‌‌‌ న్యూస్‌‌‌‌ పేపర్ సబ్‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌ చేయించే పనిచేసేవాడు. అలా సబ్‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌ చేయించినందుకు కొంత డబ్బు వచ్చేది. అయితే.. మైఖేల్ అందరిలా కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించేవాడు. సబ్‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌ చేయించడానికి ఇంటింటికి వెళ్లేవాడు కాదు. పబ్లిక్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌లో కొత్తగా పెళ్లైన వాళ్ల లిస్ట్‌‌‌‌, ఇండ్లు మారిన వాళ్ల లిస్ట్ తీసుకుని వాళ్లనే టార్గెట్‌‌‌‌ చేసేవాడు.

అలాంటి వాళ్లయితేనే సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌ తీసుకునే అవకాశాలు ఎక్కువ. అలా చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ సబ్‌‌‌‌స్క్రిప్షన్లు చేయించగలిగాడు. అందుకే అప్పట్లోనే ఏడాదికి18 వేల అమెరికన్ డాలర్లు సంపాదించాడు. అది వాళ్ల కాలేజీలో పనిచేసే కొందరు లెక్చరర్ల జీతం కంటే ఎక్కువ. ఆ తర్వాత అతనే కొందరు ఉద్యోగులను రిక్రూట్‌‌‌‌ చేసుకుని పనిచేయించాడు. ఆ తర్వాత వ్యాపారం చేయడమే మేలని డిసైడ్​ అయ్యి చదువు మధ్యలోనే ఆపేశాడు. పందొమ్మిదేండ్ల వయసులోనే చదువుకు ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పెట్టాడు. 

చిన్నగా మొదలై.. 

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌‌‌‌లో ప్రి–మెడ్ స్టూడెంట్‌‌‌‌గా ఉన్నప్పుడే మైఖేల్‌‌‌‌ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్‌‌‌‌లో అద్దెకు ఒక రూమ్​ తీసుకున్నాడు. అందులో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌గ్రేడ్ కిట్‌‌‌‌లను అసెంబుల్‌‌‌‌ చేసి అమ్మేవాడు. అప్పుడు మైఖేల్‌‌‌‌ దగ్గర పెట్టుబడికి వెయ్యి డాలర్లు మాత్రమే ఉన్నాయి. అయినా వెనకడుగు వేయలేదు. తను అనుకున్న పని మొదలుపెట్టాడు. ఆరడుగుల టేబుల్‌‌‌‌, స్క్రూడ్రైవర్‌‌‌‌లతో ముగ్గురు కుర్రాళ్ళు మాత్రమే ఉండేవాళ్లు. లైసెన్స్ తీసుకోకుండానే చాలా రోజులు ఈ వ్యాపారం చేశాడు. తర్వాత టెక్సాస్ స్టేట్ నుంచి వెండర్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ తీసుకున్నాడు. లైసెన్స్ వచ్చాక కంప్యూటర్ స్టోర్ పెట్టుకున్నాడు. అది కూడా తక్కువ టైంలోనే సక్సెస్‌‌‌‌ అయ్యింది.

దాంతో 1984 జనవరిలో ‘‘పీసీస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌” పేరుతో ఒక కంపెనీ పెట్టాడు. అదే ఏడాది దాని పేరుని ‘డెల్‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌’గా మార్చాడు. అప్పటివరకు పీసీలను అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేయడం లాంటివి చేసేవాళ్లు. కానీ.. కంపెనీ పెట్టిన తర్వాత ఆర్డర్ల మీద కంప్యూటర్లు తయారు చేసివ్వడం మొదలైంది. కేవలం పీసీ అప్‌‌‌‌గ్రేడ్స్​, కిట్స్​, యాడ్–ఆన్ కాంపోనెంట్స్ అమ్మడం ద్వారానే 50 వేలకు పైగా అమెరికన్ డాలర్ల లాభం సంపాదించింది కంపెనీ. దాంతో బిజినెస్ బాగా పెరిగింది. అప్పుడు ఈస్ట్​ ఆస్టిన్‌‌‌‌లోని బిజినెస్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో పెద్ద కంపెనీ పెట్టాడు మైఖేల్‌‌‌‌. ఆర్డర్ టేకర్లుగా కొంతమందిని, ఆర్డర్‌‌‌‌లను కంప్లీట్‌‌‌‌ చేయడానికి మరికొంతమందిని నియమించాడు. ఆ తర్వాత సేల్స్ విపరీతంగా పెరిగాయి. 

తక్కువ టైంలోనే.. 

నాణ్యమైన ప్రొడక్ట్స్‌‌‌‌, కస్టమర్ సేవలను అందించడంతో ఆ ఏరియాలో మంచి పేరొచ్చింది. కంపెనీ అమ్మకాలు చాలా రెట్లు పెరిగాయి. దాంతో.. 1986 లో డెల్12-మెగాహెర్ట్జ్ 286 ప్రాసెసర్‌‌‌‌ను తీసుకొచ్చింది. ఆ టైంలో అదే అత్యంత వేగవంతమైన పర్సనల్ కంప్యూటర్. ఇది మార్కెట్‌‌‌‌లో మంచి సక్సెస్​ సాధించింది. దాంతో.. 1992 సంవత్సరం నాటికి కంపెనీ ఫార్చ్యూన్ మ్యాగజైన్ టాప్ 500 కార్పొరేషన్ల లిస్ట్‌‌‌‌లో స్థానం దక్కించుకుంది. 27 ఏండ్ల అతి చిన్న వయసులో సీఈవోగా రికార్డ్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశాడు మైఖేల్‌‌‌‌. తర్వాత డెల్ నుంచి 1996లో మొదటిసారి సర్వర్స్​, 1998లో స్టోరేజ్ ప్రొడక్ట్స్‌‌‌‌ని మార్కెట్‌‌‌‌లోకి తెచ్చారు.

1996లో డెల్ వెబ్‌‌‌‌సైట్​లో కంప్యూటర్స్​ అమ్మడం మొదలుపెట్టింది. మార్చి 1997 నాటికి రోజుకు పది లక్షల అమ్మకాలు చేసే స్థాయికి ఎదిగింది. అలా.. 2001 మొదటి త్రైమాసికంలో డెల్‌‌‌‌ కంపెనీ ప్రపంచ మార్కెట్ వాటా12.8 శాతానికి చేరుకుంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద పీసీ తయారీదారుగా అవతరించింది. 

నష్టాలు 

కంపెనీ పెట్టిన కొన్నేండ్లలోనే ఎన్నో విజయాలు సాధించిన కంపెనీకి కొన్నాళ్లకు నష్టాలు తప్పలేదు. 2007 నాటికి కంపెనీ అమ్మకాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. మార్కెట్‌‌‌‌లో పోటీ పెరగడం, కంపెనీ యాజమాన్యంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నష్టాలను తగ్గించుకోవడానికి డెల్ తన ఉద్యోగులను కూడా తీసేయాల్సి వచ్చింది. ఈ కంపెనీ కూడా చరిత్రలో కొడాక్, మోటరోలా కంపెనీల్లా అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ.. కొత్త కార్పొరేట్ వ్యూహాలతో మళ్లీ నిలదొక్కుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో  కంపెనీ 102.3 బిలియన్ల ఆదాయం పొందింది. 

డైరెక్ట్ సెల్లింగ్‌‌‌‌

కంపెనీ తక్కువ టైంలో సక్సెస్‌‌‌‌ కావడానికి ముఖ్య కారణం.. ప్రొడక్ట్స్‌‌‌‌ని డైరెక్ట్‌‌‌‌గా వినియోగదారులకే అమ్మే లా ఏర్పాట్లు చేసుకోవడమే. ముఖ్యంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో డెల్‌‌‌‌ కంప్యూటర్లను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకే అమ్మే ఏర్పాట్లు చేశారు. అందువల్ల తక్కువ ధరకే కంప్యూటర్లు ఇవ్వగలిగారు. కంపెనీ ఇంటర్నెట్ సైట్, వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌ లాంటి వాటి ద్వారా అమ్మకాలు బాగా పెరిగాయి. అప్పట్లోనే ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెట్టిన కొన్ని రోజుల్లోనే డెలివరీ ఇవ్వడంతో మార్కెట్‌‌‌‌లో డిమాండ్ పెరిగింది. 

మరిన్ని ప్రొడక్ట్స్‌‌‌‌

డెల్ టీవీలు, హ్యాండ్‌‌‌‌హెల్డ్‌‌‌‌లు , డిజిటల్ ఆడియో ప్లేయర్లు, ప్రింటర్లను కూడా తయారుచేసింది.  కంప్యూటర్ల అమ్మకాలపై భారీ డిపెండెన్సీని తగ్గించడానికి చేసిన ప్రయత్నం ఇది. కానీ.. మార్కెట్‌‌‌‌లో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో మాత్రమే ఎక్కువగా అమ్ముడయ్యాయి. 

మైల్ స్టోన్స్‌‌‌‌ 

 •     1984లో మైఖేల్ డెల్ ‘డెల్ కంప్యూటర్ కార్పొరేషన్‌‌‌‌’ ఫౌండర్​. 
 •     1985లో కంపెనీ మొదటి కంప్యూటర్‌‌‌‌ను, సొంత డిజైన్‌‌‌‌తో తయారు చేసింది. దాని పేరు ‘టర్బో పీసీ’.
 •     1987లో డెల్ ఐర్లాండ్‌‌‌‌లో మొదటి ఆఫీస్‌‌‌‌ పెట్టింది. 
 •     1989లో డెల్ మొదటి నోట్‌‌‌‌బుక్ కంప్యూటర్ 316ఎల్‌‌‌‌టీని రిలీజ్​ చేసింది.
 •     1990లో ఆఫీస్‌‌‌‌లో స్టాఫ్‌‌‌‌ను దాదాపు1200 మందికి పెంచారు. 
 •     1992లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ డెల్ కంప్యూటర్ కార్పొరేషన్‌‌‌‌ను ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల లిస్ట్‌‌‌‌లో చేర్చింది.
 •     1994లో మొదటిసారిగా లిథియం-అయాన్ బ్యాటరీలు తెచ్చింది. 
 •     1995లో వరల్డ్ వైడ్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ని యూరప్, అమెరికా, ఆసియాలో మొదలుపెట్టింది. 
 •     1996లో కంప్యూటర్లను వెబ్ సైట్ల ద్వారా అమ్మడం మొదలుపెట్టింది.
 •     2001లో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సిస్టమ్స్‌‌‌‌లో టాప్ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది. 
 •     2002లో డిజిటల్ ఆడియో ప్లేయర్లు, టీవీలు, ప్రింటర్లు తీసుకొచ్చింది. 
 •     2003లో ‘డెల్ ఇంక్’గా రీబ్రాండ్ చేశారు.
 •     2015 - కస్టమర్ శాటిస్​ఫాక్షన్​ రేట్​ రికార్డు స్థాయికి చేరుకుంది.
 •     2016లో ఈఎంసీ కార్ప్‌‌‌‌ని డెల్ విలీనం చేసుకుంది.