KKR vs SRH: ఐపీఎల్ ఫైనల్‌పై రూ. 2 కోట్లు పందెం కాసిన ర్యాపర్

KKR vs SRH: ఐపీఎల్ ఫైనల్‌పై రూ. 2 కోట్లు పందెం కాసిన ర్యాపర్

చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ ఫైనల్ పోరుపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. తమ జట్టుదే విజయమంటే.. కాదు, కాదు తమ అభిమాన జట్టే గెలుస్తుందంటూ ఆయా జట్ల అభిమానులు వేల మొదలు లక్షల వరకూ పందెం కాస్తున్నారు. తాజాగా, ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలోకి ఓ ర్యాపర్ దిగాడు. 

మే 26న, ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు విజయం సాధిస్తుందని గ్రామీ అవార్డు విజేత కెనడియన్ ర్యాపర్, సింగర్ డ్రేక్ సుమారు రూ. 2.07 కోట్లు(250,000 USD) పందెం వేశాడు. పందెం వివరాలను అతను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రేక్ ఏదేని క్రికెట్ మ్యాచ్‌పై పందెం వేయడం ఇదే తొలిశారట. అతను కోల్‌కతా గెలుస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.  ఒక‌వేళ అత‌ని అంచ‌నా నిజ‌మైతే రూ.4 కోట్లు రిటర్న్ దక్కుతాయి. అయితే.. గ‌తంలో డ్రేక్ పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో, ఈసారి కూడా అదే జ‌రుగుతుంద‌ని కొంద‌రు అనుకుంటున్నారు.

రెండుసార్లు పరాజయం

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు.. ఇప్పటికే  కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓటమి పాలైంది. లీగ్ దశలో 4 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గిన కేకేఆర్.. క్వాలిఫైయర్ 1లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీకి అడ్డుగా నిలబడింది. కమ్మిన్స్ సేన తుదిపోరులో విజయం సాధించి.. గత రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటుందా..! లేదా..! అనేది చూడాలి. 

శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ రూపంలో బ్యాటర్లు.. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి రూపంలో మంచి బౌలర్లు కోల్‌కతా సొంతం. వీరిని ఓడించడం కమ్మిన్స్ సేనకు శ్రమతో కూడుకున్నదే.