
- విద్యాశాఖ మంత్రి సబిత హామీ
హైదరాబాద్, వెలుగు : డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు త్వరలో న్యాయం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబిత హామీ ఇచ్చారు. ఈ విషయమై సీఎం కేసీఆర్తో ఇటీవలే మాట్లాడానని, అధికారిక నిర్ణయం వెలువడిన వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
శుక్రవారం మంత్రి సబితను డీఎస్సీ 98 సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉపేందర్ తదితరులు కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఉన్న 2,400 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులకు త్వరలోనే ఉద్యోగాలిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తమకు చెప్పారని వారు ఓ ప్రకటనలో తెలిపారు.