
వెలుగు: చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించినట్లు తెలిసింది . బుధవారం ప్రగతి భవన్ లో సమావేశమైన సందర్భంగా ఆమెకు సీఎం ఈ బాధ్యతలు అప్పగించి నట్లు సమాచారం. చేవెళ్ల స్థానం నుంచి జి.రంజిత్‌రెడ్డి పేరును ఖరారు చేశామని, ఆయనను గెలిపించాలని సూచించినట్లు తెలిసింది. త్వరలోనే సబితకు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని ఆయన అన్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో సబిత రంగంలోకి దిగారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం మలక్‌పేట తిరుమల హిల్స్‌లోని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివాసానికి కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ఆమె వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం స్థానం నుంచి తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా సబిత పోటీ చేసి గెలిచారు. చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కలిసి పనిచేద్దామని తీగల కృష్నారెడ్డితో సబిత అన్నట్లు సమాచారం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది . పార్టీ అభ్యర్థిని సీఎం ఖరారు చేసిన సంగతి కూడా వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. శుక్రవారం రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తోనూ సబిత సమావేశం కానున్నారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరితో సబితా ఇంద్రారెడ్డి త్వరలో భేటీ కానున్నారు. కాగా, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో సబిత కొడుకు కార్తీక్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. మైలార్‌దేవిపల్లిలోని ప్రకాశ్ గౌడ్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నందున కలిసి పనిచేద్దామన్నారు.