
హైదరాబాద్, వెలుగు: ఈసారి పదో తరగతిలో వంద శాతం పాస్ సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఈవోలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. గురువారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఆఫీస్‌లో జరిగిన డీఈవోలు, వివిధ శాఖల ఇంజనీర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈసారి కూడా కరోనా ప్రభావం ఉన్నందున టెన్త్ క్లాస్స్టూడెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా టెన్త్ ఎగ్జామ్స్‌లో 70 శాతం సిలబస్‌ను పరిగణలోకి తీసుకోవడం, పరీక్షా సమయాన్ని పెంచడం, క్వశ్చన్ పేపర్‌లో చాయిస్‌లు, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలను పెంచడం వంటి అంశాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. ‘మన ఊరు మన బడి’కార్యక్రమంతో స్కూళ్లల్లో చేస్తున్న పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.