
‘గాంధీ’ సినిమాను చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. నగరంలో ఓ థియేటర్ లో గాంధీ సినిమాను చూసేందుకు వెళ్లిన విద్యార్థులు ఎస్కలేటర్ ఎక్కుతుండగా అది రివర్స్ కావడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థులను మంత్రి కలిసి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి సబిత ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం అని అన్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని..ఇప్పటికే కొందరిని డిజార్జి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు పిల్లలకి చిన్న చిన్న సర్జరీలు చేశారని, వారు కూడా త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగదని అన్నారు. విద్యార్థుల ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన థియేటర్ యాజమాన్యంపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.