బాలాపూర్ గణనాథునికి మంత్రి సబిత తొలి పూజ

బాలాపూర్ గణనాథునికి మంత్రి సబిత తొలి పూజ

బాలాపూర్ గణనాథునికి తొలి రోజు పూజ చేసే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాలాపూర్ గణేషుడికి తన కుమారుడు కౌశిక్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సబిత.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ మేలు జరగాలని,  రైతులను భగవంతుడు చల్లగా చూడాలని,  అన్ని రంగాల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని . ఎలాంటి విఘ్నాలు రాకుండా ఈ సంవత్సరం కూడా అభివృద్దిలో ముందుకు సాగాలని భగవంతున్ని  కోరుకున్నానని సబిత తెలిపారు. భగవంతుడి ఆశిస్సులుంటే బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొంటామని సబిత చెప్పారు.  ఈ సందర్భంగా అందరికీ మంత్రి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

బాలాపూర్లో 18 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పుతో మహాగణపతి విగ్రహాన్ని  ఏర్పాటు చేశారు.  పంచముఖ నాగేంద్రుడిపై కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నాడు బాలాపూర్ గణేషుడు.  పదిరోజుల పాటు కష్టపడి  విజయవాడలోని  ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం థీమ్ లో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుండి బాలాపూర్ గణపతి ని చూసేందుకు తరలివస్తున్న భక్తులు. బాలాపూర్ గణేశుడికి 21 కిలోల లడ్డూను వెండి గిన్నెలో నైవేద్యంగా సమర్పించారు  హానిఫుడ్స్ ఉమామహేశ్వరరావు.  ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డును ఆయనే అందిస్తున్నారు.