తీగలను ఎవరో మిస్ గైడ్ చేశారు

తీగలను ఎవరో మిస్ గైడ్ చేశారు

భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆయనను ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలానికి వచ్చిన సబిత ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. తీగల కృష్ణారెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలియదని అన్నారు. అదేమంత పెద్ద ఇష్యూ కాదని, భూకబ్జా ఆరోపణలపై తీగలను కలిసి మాట్లాడతానని చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడికే విచారణ జరుపుకోవచ్చని సబిత స్పష్టం చేశారు. కబ్జాలకు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించదని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ స్థలాలను వదలడం లేదని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్పేట్ ప్రాంతాన్ని ఆమె నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అరాచకాలను చూస్తూ ఊరుకోనని.. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని తీగల స్పష్టం చేశారు.