- మంత్రి సీతక్కపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలపై తాను ఏనాడూ ఎలాంటి కామెంట్లు చేయలేదని, వ్యవస్థలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి సీతక్క తనను దొరసాని అనే పెద్ద మాట ఎందుకు అన్నారో తెలియదని, ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆమె చిట్‌చాట్ చేశారు. బీఆర్ఎస్హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సీతక్క అన్నప్పుడు తాను కేవలం ‘అయ్యో’ అని మాత్రమే అన్నానని, అంతకు మించి ఒక్క మాటైనా మాట్లాడలేదని చెప్పారు.
తిట్లతోనే హీరోలు అయిపోతారనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తనను దొరసాని అని సీతక్క ఎలా అంటారని మండిపడ్డారు. రేవంత్ లాగానే ఆయన చెల్లెలు సీతక్క మాట్లాడుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ ఎంత హుందాగా నడిచిందో.. ఇప్పుడు ఎలా తయారైందోనని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
