అన్నపై తమ్ముడు పైచేయి.. యువరాజ్ జట్టుపై సచిన్ సేన విజయం

అన్నపై తమ్ముడు పైచేయి.. యువరాజ్ జట్టుపై సచిన్ సేన విజయం

విద్య, ఆరోగ్య రంగాలకు సహాయం చేసేందుకు విరాళాల సేకరణ కోసం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు.. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని వన్ ఫ్యామిలీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువీ సేన నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని.. సచిన్ సేన మరో బంతి మిగిలివుండగానే చేధించింది.

డారెన్‌ మ్యాడీ

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన వన్‌ ఫ్యామిలీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాడు డారెన్‌ మ్యాడీ (51; 41 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. టీమిండియా మాజీలు యూసఫ్‌ పఠాన్‌ (38), యువరాజ్‌ సింగ్‌ (23) పరుగులు చేశారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్‌, ఆర్పీ సింగ్‌, అశోక్‌ దిండా, మాంటీ పనేసర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

అన్నపై తమ్ముడి పైచేయి.. 

అనంతరం 181 పరుగుల లక్ష్య ఛేదనను వన్‌ వరల్డ్‌ జట్టు 19.5 ఓవర్లలో చేధించింది. మొదట నమన్‌ ఓఝా (25), సచిన్‌ టెండూల్కర్‌ (27) జోడి మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. మిగిలిన పనిని సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ అల్విరో పీటర్సన్‌ (74) పూర్తిచేశాడు. వన్‌ వరల్డ్‌ విజయానికి చివరి 2 బంతుల్లో 3పరుగులు కావాల్సివుండగా.. యూసఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ సిక్సర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. వన్‌ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్‌, యువరాజ్‌ సింగ్‌, జేసన్‌ క్రేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

బెంగళూరులోని సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో పాల్గొన్నారు.