
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు బీసీసీఐ అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నారనే వార్తలపై క్లారిటీ వచ్చింది. తనకు బీసీసీఐ అధ్యక్ష పదవితో సంబంధం ఉందనే ఊహాగానాలను ఆయన నిర్వహణ సంస్థ గురువారం (సెప్టెంబర్ 11) ఖండించింది. దీంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీలో సచిన్ లేనట్టు కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జరగనుంది. ఈ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛైర్మన్ సహా పలు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఈ క్లారిటీ వచ్చింది.
"బీసీసీఐ అధ్యక్ష పదవికి సచిన్ టెండూల్కర్ పేరును పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికలు, పుకార్లు వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి పరిణామం జరగలేదని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. ఆధారం లేని ఊహాగానాలకు నమ్మకూడదని మేము కోరుతున్నాం. " అని SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఏడాది జనవరిలో దేవజిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నెల ప్రారంభంలో 70 ఏళ్లు నిండిన తర్వాత రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ అత్యున్నత పదవి ఖాళీగా ఉంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి పదవులకు ఓటింగ్ జరగనుంది. వస్తున్న సమాచార ప్రకారం బోర్డులో ప్రస్తుత కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ రోహన్ గౌన్స్ దేశాయ్, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటి తమ పదవులను నిలుపుకుంటారు. బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులతో పాటు ఐపీఎల్ చైర్మన్ పదవి ఎవరికీ దక్కుతుందో ఆసక్తికరంగా మారింది. రాజీవ్ శుక్లా ప్రస్తుత బీసీసీఐ ఉపాధ్యక్షుడు. అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్.