Shubman Gill: గిల్‌లో ఆ విషయం నన్ను బాగా ఆకట్టుకుంది: సచిన్ టెండూల్కర్

Shubman Gill: గిల్‌లో ఆ విషయం నన్ను బాగా ఆకట్టుకుంది: సచిన్ టెండూల్కర్

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తన తొలి టెస్ట్ సిరీస్ లోనే ఆకట్టుకున్నాడు. ఆడుతుంది ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ అయినా.. తనకు యంగ్ జట్టు ఉన్నప్పటికీ అంచనాలను అందుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒక వైపు బ్యాటర్ గా దుమ్మురేపుతూ  సిరీస్ మొత్తంలో 754 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన గిల్.. తనదైన కెప్టెన్సీతో అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోవడంతో పాటు సొంతగడ్డపై ఇంగ్లాండ్ కు సిరీస్ దక్కకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీ గురించి టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు.  

ALSO READ | Asia Cup 2025: టీమిండియాకు భారీ ఊరట.. ఆసియా కప్‌కు సూర్య వచ్చేస్తున్నాడు         

సచిన్ మాట్లాడుతూ.. "గిల్ లో నేను గమనించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను మంచి బంతులను గౌరవించాడు. కొన్నిసార్లు బంతిని ఫ్రంట్ ఫుట్ ద్వారా నెట్టి పరుగులు సాధిస్తారు. కానీ గిల్ బంతిని అక్కడ ఫ్రంట్ ఫుట్ ద్వారా డిఫెండ్ చేయగలిగాడు. అతను డిఫెన్స్ సాలిడ్ గా అనిపించింది. మొత్తం మీద అతని షాట్ సెలక్షన్ ఖచ్చితంగా ఉంది". అని టెండూల్కర్ రెడ్డిట్‌లో మాట్లాడుతూ అన్నారు. ఈ సిరీస్ లో లీడ్స్, మాంచెస్టర్ లో సెంచరీలు బాదిన గిల్.. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసి సత్తా చాటాడు.  

గిల్ కెప్టెన్సీ గురించి కూడా ప్రశంసలు కురిపించాడు. "కెప్టెన్సీ జట్టులోని మిగతా ఆటగాళ్ల ప్రదర్శనతో ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు, బౌలర్లు అనుకున్న విధంగా జరగకపోతే  ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడే కెప్టెన్ తనతో ఉన్న 10 మంది ఆటగాళ్లు సరిపోరని భావిస్తాడు. గిల్ ప్రశాంతంగా కనిపించాడు. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను నిర్మించినప్పుడు, ఏ కెప్టెన్‌కైనా ఆట ప్రణాళికను రూపొందించడం.. పరుగులు నియంత్రించడం కష్టమవుతుంది. కానీ గిల్ జట్టును, ఆటను బాగా కంట్రోల్ చేశాడు". అని సచిన్ అన్నాడు.