
ఇయ్యాల్టి నుంచే ఉత్సవాలు
ముషీరాబాద్/గండిపేట, వెలుగు: ఇయ్యాల్టి నుంచి సిటీలో సదర్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న సదర్ వేడుకల కోసం ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి దున్నలను సిటీకి తీసుకొచ్చారు. 27న ముషీరాబాద్‌లో జరగనున్న సదర్ ఉత్సవాల్లో హర్యానా రాష్ట్రానికి చెందిన ‘శ్రీకృష్ణ’ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదేండ్ల వయసున్న దీని ఎత్తు 18 అడుగులు, బరువు 1800 కిలోలు. ముర్రాజాతికి చెందిన శ్రీకృష్ణను హర్యానా నుంచి ప్రత్యేక కంటైయినర్‌లో సిటీకి తీసుకొచ్చినట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. ఈ దున్నకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 10 లీటర్ల పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లను ఆహరంగా పెడుతున్నామన్నారు. 2 లీటర్ల ఆవనూనెతో మసాజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సదర్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ దున్నను మంగళవారం ఆయన పరిశీలించారు. సదర్ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలని కోరారు.
నార్సింగిలో గొడవ
నార్సింగిలో మంగళవారం రాత్రి సదర్ ముందస్తు వేడుకల్లో భాగంగా జరిగిన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ ప్రసన్న భర్త ఆశోక్‌యాదవ్ మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దున్నరాజుల ఊరేగింపులో ఇద్దరి మధ్య గొడవ మొదలై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంకటేశ్ యాదవ్ అనుచరులు మాజీ సర్పంచ్ ప్రసన్న ఇంటిపై రాళ్ల విసరగా.. ఆమె భర్త అశోక్ యాదవ్, అనుచరులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి కేసు ఫైల్ చేశారు.