ఐదేండ్లుగా కొనసాగుతున్న సదర్మట్ బ్యారేజీ వర్క్స్

ఐదేండ్లుగా కొనసాగుతున్న సదర్మట్ బ్యారేజీ వర్క్స్

జగిత్యాల, వెలుగు: గోదారి నదిపై జగిత్యాల జిల్లా మూలరాంపూర్, నిర్మల్ జిల్లా శివారులో చేపట్టిన సదర్మట్ వర్క్స్ స్లోగా నడుస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు మధ్యలో రెండేళ్లు ఆగిపోయాయి. మళ్లీ గతేడాది పనులు మొదలైనా సర్కార్ నిధుల మంజూరులో జాప్యం చేస్తుండడంతో బ్యారేజీ నిర్మాణం పూర్తవడం లేదు. ప్రస్తుతం గేట్ల ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. కానీ ఇందుకు అవసరమైన రూ. 100 కోట్లు మంజూరు కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. 2016 లో రూ. 516 కోట్లతో సదర్మట్ బ్యారేజీ నిర్మాణానికి సర్కారు పచ్చజెండా ఊపింది. 2017 జనవరి 11న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావ్​ శంకుస్థాపన చేశారు.  గోదావరిపై సుమారు 987 మీటర్ల పొడవునా 55 పిల్లర్లతో గేట్లు నిర్మించాలని ఆఫీసర్లు ప్లాన్ రూపొందించారు. ఇందులో భాగం గా 1.58 టీఎంసీల నిల్వ కెపాసిటీతో సుమారు 17 కిలోమీటర్ల పొడవునా నీళ్లు నిలిచి ఉండేలా బ్యారేజీ పనులు చేపట్టారు. దీంతో భూగర్భజలాలు సైతం పెరగడానికి అవకాశాలుంటాయి. కొద్దికాలం బ్యారేజీ పనులు చురుకుగా జరిగినా గోదావరికి అడ్డంగా చేపట్టిన 55 పిల్లర్ల వర్క్స్ కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్ల నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో 2019 ఆగస్టులో పనులు ఆగిపోయాయి. 2021లో సీఎం కేసీఆర్ స్వయంగా నీటి పారుదల శాఖ ఆఫీసర్లతో సమావేశమై సదర్మట్ బ్యారేజీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆ తర్వాత పనులు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం బ్యారేజీ పిల్లర్లు పూర్తయ్యాయి. గేట్ల ఏర్పాటుకు మరో రూ. 100 కోట్లు అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ నిధులు మంజూరైతే జులై చివరి వరకు బ్యారేజీ పనులు కంప్లీట్ చేయవచ్చని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.   

రైతులకు రూ. 11 కోట్ల పెండింగ్   

బ్యారేజీ నిర్మాణం వల్ల జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మనాల రాంపూర్, ఎర్ధండి, కోమటి కొండాపూర్ గ్రామాల్లో 350 ఎకరాలు, నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్, కొత్తూర్, కమల్ కోట, ఆదర్శనగర్ గ్రామాల్లో 750 ఎకరాలు మొత్తంగా 1,100 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో జగిత్యాల జిల్లాకు చెందిన రైతులకు పరిహారం అందగా, నిర్మల్ జిల్లాకు చెందిన రైతులకు ఇంకా రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఐదేళ్లుగా భూ నిర్వాసితులు నష్ట పరిహారం కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.   

జులై నాటికి పూర్తి చేస్తం

సదర్మట్ బ్యారేజీ పనులు జులై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 85 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇంకా భూ నిర్వాసితులకు రూ. 11 కోట్లు చెల్లించాల్సి ఉంది. గేట్ల ఏర్పాటుకు మరో రూ. 100 కోట్లు మంజూరు కావాల్సి ఉంది.
‌‌- సురేంద్రనాథ్ రాథోడ్, సదర్మట్ డీఈ