
- గిన్నిస్లోకిమన బతుకమ్మ
- ఒకేసారి 1,354 మహిళలు ఆడిపాడటంతో మరో రికార్డు
- సరూర్‌నగర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ
ఎల్బీనగర్, వెలుగు:మన ఆడబిడ్డల పండుగ బతుకమ్మ.. గిన్నిస్ రికార్డులోకెక్కింది. బతుకమ్మను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ పేర్చారు. ఈ మెగా బతుకమ్మ 63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో ఏర్పాటు చేశారు. 11 లేయర్లతో.. 9 రకాల పూలతో బతుకమ్మ పేర్చారు. ఈ భారీ బతుకమ్మను 300 మంది.. 3 రోజుల పాటు కష్టపడి తయారు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు బతుకమ్మ చుట్టూ 1,354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. ఒకేలా ఆడుతూ, ఒకే పాట పాడుతూ తిరగడంతో మరో గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రకటించారు.
బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. బతుకమ్మ ఈ స్థానాన్ని సాధించేందుకు విమలక్క పాటలు కూడా ఒక కారణమని కొనియాడారు. భారీ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డ్ సాధనకు కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఏదైనా సాధిస్తామని మహిళలు నిరూపించారని మంత్రి సీతక్క అన్నారు. ఈ భారీ వేడకతో మన బతుకమ్మ గ్లోబల్ స్థాయికి చేరిందని తెలిపారు.
‘ఎంతో శ్రద్ధ, భక్తితో 3 రోజులు కష్టపడి బతుకమ్మను పేర్చి, ఆడి రికార్డు సృష్టించిన అక్కాచెల్లెళ్లందరికీ వందనాలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలం. తెలంగాణ ఆడబిడ్డలు దీన్ని నిరూపించారు’ అని మంత్రి సీతక్క అన్నారు. అనంతరం సీతక్క బతుకమ్మపాట పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రజా గాయకురాలు విమలక్క, టూరిజం శాఖ ఎండీ వల్లూరి క్రాంతి తదితరులు హాజరయ్యారు.
ఆడిపాడిన మిస్‌వరల్డ్
మెగా బతుకమ్మ వేడుకలో థాయ్‌లాండ్‌కు చెందిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి సీతక్క, ఇతర మహిళలతో కలిసి ఓపల్ సుచాత ఆడిపాడారు. ఇలాంటి వేడుకను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, ఈ బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఓపల్ సుచాత సువాంగ్ అన్నారు.
గొప్ప సంస్కృతి: రేవంత్
ప్రకృతి.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడబిడ్డలందరూ ఆట పాటలతో సంబురాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికి, సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించిందని తెలిపారు.