పద్మారావునగర్, వెలుగు: పనిచేస్తున్న ఇండ్లలోనే చోరీలకు పాల్పడిన ఘటనలు వేర్వేరు చోట్ల జరిగాయి. ఇలాంటి రెండు కేసులను సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు ఛేదించారు. మంగళవారం నార్త్ జోన్ డీసీపీ ఎస్.రష్మిపెరుమాళ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన ఆభరణాల వ్యాపారి గజవాడ శ్రీధర్ ఇంట్లో కొంతకాలంగా బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు మాయమవుతున్నాయి. ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఇంటి పనిమనిషి మాధవి, ఆమె భర్త కృష్ణయ్య కలిసి ఈ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. దొంగిలించిన బంగారంలో కొంత కరిగించి ఆభరణాలుగా మార్చుకున్నారు.
నిందితుల నుంచి 24.2 తులాల బంగారం స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు పంపారు. మరో ఘటనలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డోవ్‌టన్ రోడ్డుకు చెందిన యెల్లు సుజాత ఇంట్లో అల్మారాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విచారణ జరిపిన పోలీసులు ఇంటి పనిమనిషి(చిన్నారి) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆమె వద్ద 5.1 తులాల బంగారు గొలుసు, 2 తులాల కరిగించిన బంగారం, 61 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
