Saeed Ajmal: వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మా ప్రభుత్వమే మమల్ని మోసం చేసింది: మాజీ పాక్ స్పిన్నర్ ఆవేదన

Saeed Ajmal: వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మా ప్రభుత్వమే మమల్ని మోసం చేసింది: మాజీ పాక్ స్పిన్నర్ ఆవేదన

టీమిండియా పాకిస్థాన్ పై ఆసియా కప్ గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించి భారత జట్టుకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆసియా కప్ గెలిచినందుకు బీసీసీఐ రూ.21 కోట్ల భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. భారత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే బీసీసీఐ మాత్రం ఏకంగా రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించి బోర్డు గొప్పతనాన్ని చాటుకుంది. బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీ ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే 8 రెట్లు ఎక్కువ కావడం విశేషం. బీసీసీఐ టీమిండియాకు ఇంత భారీ మొత్తంలో నజరానా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 

గతంలోనూ ఐసీసీ టైటిల్స్ గెలిచినందుకు గాను కోట్ల వర్షం కురిపించింది. గత ఏడాది రోహిత్ కెప్టెన్సీలో భారత్ జ ట్టు అద్భుతమైన విజయం  సాధించినందుకు..టీమిండియా జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ.58 కోట్ల రూపాయల భారీ నగదును ప్రకటించింది. ఐసీసీ టోర్నీ గెలిస్తే బీసీసీఐ నుంచి టీమిండియాకు ఇంత భారీ మొత్తం లభించడం సాధారణమే. కానీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మాత్రం ఐసీసీ టోర్నీ గెలిస్తే ఆ దేశ ప్రభుత్వమే ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి ఆటగాళ్లను మోసం చేసిందట.

పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ పాత వీడియోలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. అప్పటి పాకిస్థాన్ ప్రధానిపై అజ్మల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం షాకింగ్ గా మారుతున్నాయి. 2009లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ రూ. 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ డబ్బు వారికి ఎప్పుడూ చెల్లించలేదని అజ్మల్ చెప్పిన పాత వీడియో  ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2023లో నాదిర్ అలీతో కలిసి చేసిన పాడ్‌కాస్ట్‌లోని క్లిప్‌లో అజ్మల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.

 "ప్రభుత్వ చెక్కు కూడా బౌన్స్ అవుతుందని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ విషయాన్ని మేము పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ కు తెలియజేశాము. వారు మా సమస్యను హ్యాండిల్ చేస్తారనుకుంటే మాకు సంబంధం లేదని చెప్పింది. ఇదంతా గవర్నమెంట్ ప్రామిస్ అని దీనికి మేము ఏం చేయలేమని చేతులెత్తేసింది. చివరికి మాకు ఐసీసీ నుంచి వచ్చిన ప్రైజ్ మెనీ తప్పితే ఏదీ దక్కలేదు". అని అజ్మల్ తెలిపాడు. 2009 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టులో ఉన్న అజ్మల్ 12 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో కొన్ని సంవత్సరాల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. చివరికి 2015లో తన కెరీర్ ముగిసింది.