బెంగళూరు: వరల్డ్ టెన్నిస్ లీగ్ (డబ్ల్యూటీఎల్)కు తొలిసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. బెంగళూరులో డిసెంబర్ 17 నుంచి జరిగే ఈ మెగా లీగ్‌లో నాలుగు ఫ్రాంచైజీ జట్లు.. 16 మంది ఇంటర్నేషనల్, ఇండియా ప్లేయర్లు బరిలో నిలిచారు. హైదరాబాద్ యంగ్‌స్టర్స్ యమలపల్లి సహజ, భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు వేర్వేరు జట్లలో అవకాశం లభించింది. రష్యా స్టార్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్, ఇండియా డబుల్స్ లెజెండ్ రోహన్ బోపన్నతో కలిసి సహజ డిఫెండింగ్ చాంపియన్ అయిన గేమ్ ఛేంజర్స్ ఫాల్కన్స్ తరఫున ఆడనుంది.
కెనడా ఆటగాడు డెనిస్ షెపవలోవ్ నాయకత్వం వహించే వీబీ రియాల్టీ హాక్స్ టీమ్‌లో ఇండియా ప్లేయర్ యూకీ భాంబ్రీ చోటు దక్కించుకున్నాడు. ఇండియా సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్, హైదరాబాదీ శ్రీవల్లి రష్మిక .. గైల్ మోన్‌ఫిల్స్ తో కలిసి ఏఓఎస్ ఈగల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 2022 వింబుల్డన్ ఫైనలిస్ట్ నిక్ కిరియోస్ కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు. దక్షిణేశ్వర్ సురేష్, అంకితా రైనాతో కూడిన ఆసీ మావెరిక్స్ కైట్స్ తరఫున కిరియోస్ ఆడనున్నాడు.
