చిన్న బడ్జెట్ చిత్రమైనా.. కథలో బలం ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సాయి కంపాటి దర్శకత్వం, సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాను ఒక్కసారిగా హైప్ కు తీసుకెళ్లింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలోనే రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రెండో వారం విజయవంతంగా దూసుకెళ్లోంది.
ఒకే ఒక్క ఫోన్ కాల్
ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం అందించిన సురేష్ బొబ్బిలికి విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పాటలు అద్భుతంగా ఉన్నాయంటూ.. ఆయన పనితీరుపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాల మేకర్స్ దృష్టిలో సురేష్ బొబ్బిలి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 'విరాట పర్వం' చిత్రానికి పనిచేసే సమయంలో తాను మద్యపానానికి బానిసనయ్యానని, అయితే అదే సినిమాలో కథానాయికగా నటించిన సాయి పల్లవి చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని సురేష్ వెల్లడించారు.
సాయి పల్లవి చలవతో..
'విరాట పర్వం' చిత్రానికి తొలుత సంగీత దర్శకుడిగా సంతకం చేశాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల నన్ను తొలగించి, మరొకరిని తీసుకున్నారు. అయితే, మళ్లీ ఆ ప్రాజెక్ట్ నాకే తిరిగి వచ్చింది. నన్ను కొనసాగించాలని నిర్మాతలను పట్టుబట్టి కోరింది సాయి పల్లవి అని సురేష్ తెలిపారు. అయితే, సినిమా ఫైనల్ మిక్సింగ్ పూర్తయిన తర్వాత, సాయి పల్లవి నుంచి వచ్చిన అనూహ్యమైన ఫోన్ కాల్ తన జీవితంలో మైలురాయిగా నిలిచిందని సురేష్ గుర్తు చేసుకున్నారు. సినిమా విడుదలయ్యాక, మొదట అభినందనలు అందుకునేది సంగీత దర్శకులే. ఆ తర్వాతే టెక్నీషియన్లు, ఆ తర్వాత ఆర్టిస్టులు. కాబట్టి, మీ పనిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కృషిని పెట్టి, మద్యం వంటి అలవాట్లను వదిలేసి, ముందుకు వెళ్లండి. అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది అని సాయి పల్లవి హితవు పలికారని తెలిపారు.
మీ కృషిని నిర్లక్ష్యం చేయవద్దు
ఆమె మాటలు తన హృదయాన్ని బలంగా తాకాయని సురేష్ చెప్పారు.సాయి పల్లవి లాంటి స్టార్ నటి నా పనిని మెచ్చుకోవడమే కాకుండా, నా వ్యక్తిగత జీవితం గురించి కూడా అంతగా పట్టించుకోవడం నన్ను కదిలించింది. సంగీత దర్శకుడిగా నాకు గొప్ప అవకాశం లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు ఉండగా, నాకు ఇంత పని దొరికింది. ఆ ఫోన్ కాల్ తర్వాత, నేను పూర్తిగా మద్యపానాన్ని మానేయాలని నిర్ణయించుకున్నానుఅని సురేష్ బొబ్బిలి ఎమోషనల్‌గా పంచుకున్నారు.
మూడు నెలలు నరకయాతన..
మద్యాన్ని వదిలించుకునే ప్రయత్నం అంత సులభంగా జరగలేదని సురేష్ తెలిపారు. ఆ మూడు నెలలు నరకంలా అనిపించింది. శరీరం వణకడం, విపరీతమైన కోరికలు, కొన్నిసార్లు నన్ను నేను అదుపు చేసుకోలేకపోయేవాడిని. కానీ, ఆ పోరాటంలో గెలిచాను. మొత్తానికి పూర్తిగా మానేశాను అని తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. 'రాజు వెడ్స్ రాంబాయి'తో పాటు, సురేష్ బొబ్బిలి ఇటీవల 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' చిత్రానికి కూడా సంగీతం అందించారు. ఈ సినిమా కూడా మంచి రివ్యూలను, డీసెంట్ కలెక్షన్లను సాధించింది.
