ఆదిలాబాద్​లో కాంగ్రెస్​కు ముగ్గురు సీనియర్ల రాజీనామా

ఆదిలాబాద్​లో కాంగ్రెస్​కు ముగ్గురు సీనియర్ల రాజీనామా
  • ఆదిలాబాద్​లో కాంగ్రెస్​కు ముగ్గురు సీనియర్ల రాజీనామా
  • కన్నీరు పెట్టుకున్న సాజిద్ ఖాన్
  • ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న సంజీవరెడ్డి  
  • గెలిచాక మళ్లీ కాంగ్రెస్​లోకి వెళ్తామని ప్రకటన

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్ ​జిల్లా కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీలో ఏండ్లుగా పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ లీడర్లయిన డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని సంజీవరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సాజిద్​ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. తన కుటుంబం మొత్తం ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ లో పనిచేస్తోందని, ఇప్పుడు పార్టీ వీడాలంటే బాధగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ముగ్గురూ మాట్లాడుతూ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అన్ని కులాలకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో పనిచేస్తున్న తమను పొమ్మనలేక పొగ పెట్టారని వాపోయారు. 

కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వడం కరెక్ట్​ కాదన్నారు. ఆయన ఓటుకు రూ.10 వేలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారని..డబ్బులతో రాజకీయం చేసేవారికే కాంగ్రెస్ పార్టీ విలువ ఇచ్చిందన్నారు. కష్టకాలంలో ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసి పార్టీని కాపాడుకున్నామని, కానీ, ఇప్పుడు పార్టీలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని..ఐదేండ్లు కూడా పార్టీలో పని చేయని వారికి టికెట్లు ఇచ్చి కార్యకర్తల గొంతు కోశారన్నారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని.. హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నామన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకే వెళ్తామని స్పష్టం చేశారు.