ఏపీలో ఎన్నికలు ఇప్పుడు లేవు... మరి ఎప్పుడంటే..

ఏపీలో ఎన్నికలు ఇప్పుడు లేవు... మరి ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్​ లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో  వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.   విజయవాడలో జరిగిన బీసీ ఐక్యత సమగ్రాభివృద్ది సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. ఆర్ధిక వెనక బాటుతనం పోగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రపంచం మారుతున్నప్పుడు అందరం మారాలి అని చెప్పుకొచ్చారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని సజ్జల అన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా ఎంతో  అభివృద్ది చెందిందంటూ... కులవృత్తులు కూడా మారుతన్నాయని  వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తామన్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా.. యువత భవిష్యత్​ కోసం  ఉన్నత చదువుల వైపు అడుగులు వేసి.. ప్రోత్సహించే వారికి మద్దతు ఇవ్వాలా అనే అంశాన్ని ఆలోచించాలన్నారు.   ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకటి చేస్తానంటే.. చంద్రబాబు పది చేస్తానని చెబుతాడని సజ్జల అన్నారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లేయండి అని జగన్​ మాదిరిగా ఏనాయకుడైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. బీసీ ల​అభివృద్దికి జగన్​ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.