క్యాబ్​ల సేల్స్​అదుర్స్​.. అమ్మకాలు 95 శాతం అప్​

క్యాబ్​ల సేల్స్​అదుర్స్​.. అమ్మకాలు 95 శాతం అప్​
  • ఓలా, ఉబర్​ నుంచి భారీ ఆర్డర్స్​

న్యూఢిల్లీ: ఓలా,  ఉబర్​ వంటి  క్యాబ్ అగ్రిగేటర్​/ఫ్లీట్​ కంపెనీలు విపరీతంగా ఆర్డర్లు ఇవ్వడంతో క్యాబ్స్​ కోసం వాడే కార్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపు అయ్యాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు కరోనా  ముందుస్థాయికి చేరుకుంటాయని అంచనా. పరిశ్రమ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 137,000 వెహికల్స్​ను​ ఫ్లీట్ ఆపరేటర్లు కొన్నారు. ఇది 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 95శాతం ఎక్కువ. 2019 ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ ఆపరేటర్లకు అమ్మిన 2,25,000 యూనిట్ల గరిష్ట స్థాయికి ఇది తక్కువగా ఉన్నప్పటికీ, క్యాబ్​ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 40శాతం పైగా పెరుగుతాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్​అమ్మకాలు 5-7శాతం పెరిగే అవకాశం ఉంది. 

టాక్సీ సెగ్మెంట్  క్యాబ్ అగ్రిగేటర్లకు అవసరమయ్యే వెహికల్స్​ అమ్మకాలు పెరుగుతాయని, ఇవి  ప్యాసింజర్ వెహికల్స్​అమ్మకాలను అధిగమించవచ్చని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అంచనా వేస్తున్నారు. రాబోయే నెలల్లో  పెరగనున్న ప్రయాణాలు,  పోస్ట్ పాండమిక్  ట్రావెలింగ్,  ఎలక్ట్రిక్ వెహికల్స్​కు (ఈవీలు) ఇన్సెంటివ్స్​ ఇవ్వడం ఇందుకు కారణాలు. 2020 ప్రారంభంలో కరోనా  రావడంతో 2020,  2021 ఆర్థిక సంవత్సరాల్లో క్యాబ్స్​ అమ్మకాలు వరుసగా 23శాతం,  69శాతం తగ్గాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తిరిగి ప్రారంభం కావడంతో, 2022 ఆర్థిక సంవత్సరంలో వీటి అమ్మకాలు 30శాతం వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 95శాతం పెరిగాయి. మార్కెట్ లీడర్ మారుతి సుజుకి  ఫ్లీట్ సెగ్మెంట్ అమ్మకాలు మునుపటి ఆర్థిక సంవత్సరంలో 1,13,000 యూనిట్లకు చేరాయి. అంటే ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకున్నాయి. పర్యాటక రంగం నుంచి బలమైన డిమాండ్ రావడం కమర్షియల్ అమ్మకాలను పెంచడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.  ఫ్లీట్ విభాగంలో ఈ కంపెనీకి 83శాతం వాటా ఉంది. కమర్షియల్​ ఆపరేటర్లకు ట్రావెల్  టూరిజం కలిసి వస్తోందని, అందుకే అమ్మకాలు పెరుగుతున్నాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్,  సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

మళ్లీ షేర్డ్ మొబిలిటీ

“కరోనా తగ్గుముఖం పట్టడంతో జనం షేర్డ్ మొబిలిటీని తిరిగి ఉపయోగించడం ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నాం’’ అని శ్రీవాస్తవ అన్నారు. కరోనా తీవ్రత చాలా వరకు తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ   శుక్రవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్స్​లో 17శాతం వాటా క్యాబ్స్​ అమ్మకాల నుంచే వచ్చింది. అంతకుముందు సంవత్సరం కంటే  8,20,000 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి.  రైడ్-హెయిలింగ్ వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోందని,  చాలా లాభదాయకంగానూ ఉందని ఓలా క్యాబ్స్ కోఫౌండర్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ చెప్పారు. 

కరోనా సమయంలో క్యాబ్​ ఆపరేటర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు గిరాకీ పెరుగుతోందని అన్నారు.  టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర కూడా ఫ్లీట్ సెగ్మెంట్ నుంచి  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్నదని అంగీకరించారు.     'వర్క్ -ఫ్రమ్ -ఆఫీస్' ప్రారంభం కావడం,  ఇంట్రాసిటీ ట్రావెల్ పెరగడం వంటివి ఇందుకు కారణాలని అన్నారు.  క్యాబ్​ ఆపరేటర్లు ఈవీల వాడకాన్ని పెంచుతున్నారు.  కొన్ని నెలల్లో ఉబర్,​  బ్లూస్మార్ట్  వంటి వాటికి  40 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్​ను సరఫరా చేయడానికి టాటా ఒప్పందాలను కుదుర్చుకుంది. 

ఈవీలకు ఇంకా గిరాకీ...

కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు లక్షలకుపైగా డీజిల్,  పెట్రోల్ కార్లను ఎలక్ట్రిక్ వెహికల్స్​తో భర్తీ చేయాలని చూస్తున్నందున, క్యాబ్​ అమ్మకాలు బాగుంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫ్లీట్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈవీల డిమాండ్ పెరుగుతూనే  ఉంటుందని  చెప్పారు.  అడ్వాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎడ్జ్​​కు చెందిన కునాల్ ఖట్టర్ మాట్లాడుతూ, కరోనా తర్వాత షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రికార్డు సంఖ్యలో వినియోగదారులను సంపాదిం చుకుంటున్నాయని చెప్పారు. అడ్వాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎడ్జ్ అనేది బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో, బస్ ట్రాకింగ్ యాప్ చలో,  బస్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టిన వెంచర్ క్యాపిటల్ ఫండ్. 


“ఎలక్ట్రిక్ వెహికల్స్​ నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి . కమర్షియల్​ కార్యకలాపాలకు అనువుగా ఉంటాయి. ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం సులభం. రాబోయే కొన్నేళ్లలో ఈవీ క్యాబ్​లకు డిమాండ్​ మరింత పెరగవచ్చు” అని ఖట్టర్ అన్నారు.