సలేశ్వరం జాతర మొదలైంది

సలేశ్వరం జాతర మొదలైంది

దట్టమైన నల్లమల అడవులు... అడవి మధ్యలో పెద్ద గుట్ట. అక్కడి కొండ గుహలో ఉంది సలేశ్వరం లింగమయ్య గుడి. ఈ గుడిలో ప్రతి ఏడాది జరిగే లింగమయ్య జాతర చాలా ఫేమస్. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే... చైత్ర పౌర్ణమి రోజుల్లోనే ఈ దేవాలయాన్ని తెరుస్తారు. అంటే ఏడాదిలో మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. ఈ ఏడాది సలేశ్వరం జాతర ఏప్రిల్​ 14న మొదలైంది. 17వ తారీఖు వరకు అంటే..ఐదు రోజులు జాతర జరుగుతుంది. 
‘సలి’ అంటే ‘లోయ’. లోయలో ఉండే ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ కొలువైన శివుడికి సలేశ్వరుడు అని పేరు.

ఈ పురాతన దేవాలయం గురించి పురాణాల్లో ఉంది. ఈ గుడి శంఖు ఆకారంలో కనిపిస్తుంది. పరమ శివుడికి అంకితం చేసిన ఈ గుడిని ఆరు లేదా ఏడో శతాబ్దంలో కట్టారని చెప్తారు. నల్లమల అడవుల్లో నివసించే చెంచులు సలేశ్వరుడిని కులదైవంగా భావిస్తారు. అడవిలో దొరికే ఇప్ప పువ్వు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ పూజారులు కూడా వీళ్లే. సలేశ్వరం గుడి దగ్గరకు  వెళ్లే దారంతా రాళ్లు రప్పలతో ఉంటుంది. లోయ మార్గంలో దాదాపు ఐదారు కిలోమీటర్లు కాలినడకనే వెళ్లాలి. 
గుడికి ఎదురుగా జలపాతం
ఈ గుడి దగ్గర సర్వేశ తీర్థం, పుష్కర తీర్థం అని రెండు తీర్థాలు ఉంటాయి. గుడికి ఎదురుగా జలపాతం ఉంటుంది. 200 మీటర్ల ఎత్తున్న కొండ మీద నుంచి నీళ్లు కిందకు దుంకుతాయి. భక్తులు ఇక్కడ స్నానాలు చేసి శివుడిని దర్శించుకుంటారు. ఈ జాతర చూసేందుకు నల్లమల ప్రాంతంలో ఉండే చెంచులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని చెంచులు తప్పనిసరిగా వెళ్తారు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు.  
ఇలా వెళ్లాలి
శ్రీశైలం నుంచి 60 కి.మీ, హైదరాబాద్​ నుంచి 170 కి.మీ దూరంలో ఉంది సలేశ్వరం గుడి.