ముమ్మాటికీ షార్ట్ సర్క్యూటే కారణం!..శాలిబండ అగ్ని ప్రమాదంపై పోలీస్, ఫోరెన్సిక్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ల క్లారిటీ

 ముమ్మాటికీ షార్ట్ సర్క్యూటే కారణం!..శాలిబండ అగ్ని ప్రమాదంపై పోలీస్, ఫోరెన్సిక్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ల క్లారిటీ
  •  వదంతులు నమ్మవద్దన్న అధికారులు
  •  ప్రమాద స్థలం పరిశీలన
  • గాయపడిన గుర్తు తెలియని  వ్యక్తి మృతి

ఓల్డ్ ​సిటీ, వెలుగు : శాలిబండలోని గోమాతి ఎలక్ట్రానిక్ షాపులో సోమవారం రాత్రి మంటల ఘటనకు కారణం షాపులో షార్ట్​సర్క్యూటే కారణమని తేల్చారు. ఘటన జరిగిన తర్వాత రకరకాల వదంతులు వ్యాప్తిలోకి వస్తుండడంతో పోలీసులు, ఫోరెన్సిక్,  ఫైర్ ​ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సౌత్​జోన్​ డీసీపీ ఖరే కిరణ్​ ప్రభాకర్,  ఫోరెన్సిక్ ఆఫీసర్లు​వెంకన్న, ఇక్బాల్​, ఫైర్​ఆఫీసర్లు శ్రీధర్, సురేందర్​రెడ్డి పరిశీలించారు. 

ప్రమాదం జరిగిన షాపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు స్థానికులు షాపును కారు ఢీకొట్టిందని, మరికొందరు షాపు లోపల పేలుళ్లు జరిగాయని ప్రచారం చేస్తుండడాన్ని తప్పు పట్టారు. గోమాతి ఎలక్ట్రానిక్​షాపులో షార్ట్​సర్క్యూట్​తో మంటలు వ్యాపించాక అవి రిఫ్రిజిరేటర్లు, ఏసీలోని సిలిండర్లు పేలడానికి కారణమైందని, ఆ తీవ్రత షాపు ఎదురుగా కొన్ని మీటర్ల వరకు వ్యాపించిందని చెప్పారు. దీని వల్లే నష్ట తీవ్రత పెరిగిందన్నారు.  మంటలు షాపు ముందు నుంచి వెళ్తున్న కారుకు కూడా వ్యాపించి అది కాలిపోయిందన్నారు. ఈ కారు సీఎన్​జీది అయినా, అదృష్టవశాత్తు సిలిండర్​పేలకపోవడంతో పెను ముప్పు తప్పిందన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 

 రెండు ఫ్లోర్లలో ఎలక్ట్రానిక్​ వస్తువులు ఆహుతి 

షాపులోని రెండు ఫ్లోర్లలోని ఎలక్ట్రానిక్​వస్తువులు అన్నికాలి బూడిదయ్యాయి. షాపు వెనుక గల్లీలో బయటి వ్యక్తులు పార్క్​ చేసిన ఒక ట్రాలీ ఆటో, స్కూటర్​ కాలిపోయాయి. షోరూం పక్క ఇంటితో పాటు షాపు వెనుక ఉన్న రెండు షాపులకు స్వల్పంగా మంటలంటుకున్నాయి.

 రోడ్డుపై ముందు వైపు ఉన్న బట్టల దుకాణంలోకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో షాపు బోర్డు కాలిపోయింది. ఈ విషయమై షోరూం పక్కన ఉండే ఇంటి ఓనర్ ​సులోచన మాట్లాడుతూ ‘రాత్రి పదిన్నర గంటలకు అనుకుంటా....పెద్ద పేలుడు సౌండ్​ వినిపించింది. వెంటనే మంటలు వచ్చి మా వెంటిలేటర్​ కాలిపోయింది. గోమాతి షాపు షట్టర్​100 ఫీట్ల దూరంలో ఎగిరిపడింది. దీంతో బయటకు పరిగెత్తుకు వచ్చా’ అని చెప్పింది.  

 గాయపడ్డ వ్యక్తి మృతి..ఓనర్​ పరిస్థితి విషమం  

అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడగా, షోరూం బయట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 50 ఏండ్లకు పైపబడిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈయన ఉస్మానియాలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఇతడి ఆచూకీ ఇంకా లభించలేదు. షాపులో కౌంటర్ ​మీద కూర్చున్న ఓనర్ ​శివ బన్సీలాల్(53) 80 శాతం గాయాలతో  సంతోష్​నగర్ ​అపోలోలో చికిత్స పొందుతున్నాడు. 

ఇదే షాపులో పని చేసే కార్మికులు గణేశ్​, విజయ్​, కార్తీక్​లు 50 శాతం గాయాలతో మొగల్​పురాలోని లూ హాస్పిటల్​లో చేరారు. రోడ్డుపై ఆటో నడుపుకుంటూ వెళ్తున్న డైవర్ ​సయ్యద్ ​​సాబీర్, వెనక కూర్చున్న మహ్మద్​ గౌస్​, రోడ్డుపై వెళ్తున్న ఊబర్ ​కారు డ్రైవర్ ​మణికంఠ స్వల్పంగా గాయపడ్డాడు. 

షాపునకు నాలుగడుగుల దూరంలో రోడ్డుపై రన్నింగ్ లో ఉన్న ఊబర్ ​కారు మొత్తం కాలిపోగా, దీని డ్రైవర్, ఓనర్ ​మౌలాలికి చెందిన మోహన్ ​వెంటనే దిగి తప్పించుకున్నాడు. చికిత్స పొందుతున్న వారిని చార్మినార్​ఎమ్మెల్యే జుల్ఫికర్​ అలీ పరామర్మించారు.