SBI ఏటీఎంలో హెయిర్ కటింగ్.. ఏఐ వీడియో కాదు.. వైరల్ వీడియో ఫ్రం బీహార్ !

SBI ఏటీఎంలో హెయిర్ కటింగ్.. ఏఐ వీడియో కాదు.. వైరల్ వీడియో ఫ్రం బీహార్ !

ఏటీఎంకు ఎందుకెళ్తాం. ఇదేం పిచ్చి ప్రశ్న. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికో, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికో.. కొత్త పిన్ జనరేట్ చేసుకోవడానికో.. ఇలా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్లు ఏటీఎం సెంటర్ కు వెళుతుంటారంటారా.. అవును మీరన్నది కరెక్టే. కానీ.. బీహార్లోని పాట్నాలో మాత్రం ఒక ఏటీఎం సెంటర్కు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి, గడ్డం చేయించుకోవడానికి.. మాలిష్ చేయించుకోవడానికి వెళుతున్నారు. ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలే.. అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఇది నిజం.

SBI ఏటీఎంలో హెయిర్ కటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడిదోనని ఆరా తీస్తే.. బీహార్ రాజధాని నగరం పాట్నాలో జరిగిందని తెలిసింది. ఈ SBI ఏటీఎం సెంటర్లో ఏటీఎం మెషీన్ లేదు. సెలూన్ సెటప్ ఉంది. ఏటీఎమ్‌లో సెలూన్ ప్రజలను విస్తుపోయేలా చేసింది.

పాట్నాలోని దానాపూర్‌లో ఉన్న ఈ SBI ఏటీఎం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. బయట SBI ఏటీఎం బోర్డు ఉంది. కానీ.. లోపల ఏటీఎం మిషన్ లేకపోగా ఒక హెయిర్-కటింగ్ సెలూన్ నడుస్తోంది. ఇదేంటని ఆరా తీస్తే.. తెలిసిన నిజం ఏంటంటే.. ఒకప్పుడు SBI ఏటీఎం ఉండేది. ఈ ఏటీఎం సెంటర్ను మూసేయడంతో ఆ స్థలాన్ని సెలూన్ పెట్టుకునేందుకు అద్దెకు ఇచ్చారు.

మంచి లైటింగ్, ఏసీ కూడా ఉండటంతో.. సెలూన్ ఓనర్ ఏటీఎం సెంటర్లో ఎలాంటి మార్పులు చేయకుండా సెలూన్గా వాడుకుంటున్నాడు. సెలూన్లలో ఉండే ఒక చైర్, పక్కన ఒక టేబుల్ తెచ్చి వేసేశాడు. SBI బ్యాంకు సిబ్బంది కూడా ఏటీఎం మెషీన్ను మాత్రమే తొలగించి.. ఏసీని, లైటింగ్ను అలానే ఉంచి వెళ్లడం గమనార్హం.