పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు
  • శాంతిభద్రతలను పట్టించుకోవట్లే
  • బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

ఎల్ బీ నగర్/జీడిమెట్ల/ సికింద్రాబాద్/శంషాబాద్/ షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలను  ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. పోలీసులు జనాల సమస్యలను వదిలేసి టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎల్​బీనగర్​లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. అనంతరం సామ రంగారెడ్డి మాట్లాడుతూ..  జనగామ జిల్లాలోని దేవరుప్పులలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు.  

రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతున్న పట్టించుకోని పోలీసులు  టీఆ ర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఆందోళనలో బీజేపీ రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఆధ్వర్యంలో, కుత్బుల్లాపూర్​లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్​లో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఆధ్వర్యంలో,  షాద్​నగర్​లో సెగ్మెంట్ బీజేపీ ఇన్ చార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, శంషాబాద్, సూరారంలో నిరసనలు జరిగాయి.