Samantha: ప్రశ్నించడానికి భయమెందుకు? ట్రోలింగ్‌పై సమంత స్ట్రాంగ్ రిప్లై!

Samantha: ప్రశ్నించడానికి భయమెందుకు? ట్రోలింగ్‌పై సమంత స్ట్రాంగ్ రిప్లై!

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ తను ఎదుర్కొన్న సవాళ్లపై గళమెత్తడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా దుబాయ్ లో జరిగిన  '1 బిలియన్ ఫాలోవర్స్ సమిట్ 2026' కార్యక్రమంలో మహిళల ఆరోగ్య భద్రతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనారోగ్యం, ఎదురైన ట్రోలింగ్, వ్యక్తిగతం జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైద్య విషయంలో భయమెందుకు?

మహిళల ఆరోగ్య భద్రతపై సరైన నిర్ణయం తీసుకోలేపోతున్నారని సమంత అన్నారు.  అసలు వైద్యులని ప్రశ్నించడానికి మహిళలు ఇప్పటికీ ఎందుకు భయపడుతున్నారు? అని ఆమె ప్రశ్నించారు.  వైద్యులు, రోగుల మధ్య ఉండే అంతరం వల్ల చాలా మంది మహిళలు తమ సందేహాలను అడగలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళ తన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను ప్రశ్నించే హక్కును కలిగి ఉండాలి. మౌనం కంటే సమాచారంతో కూడిన నిర్ణయమే ముఖ్యం అని పేర్కొన్నారు.

ఆ రెండేళ్ల విరామం నా కళ్లు తెరిపించింది

తనకు ఆటో ఇమ్యూన్ వ్యాధి (మయోసైటిస్) నిర్ధారణ అయినప్పుడు ఎదురైన పరిస్థితులను సమంత గుర్తు చేసుకున్నారు. నా అనారోగ్యం గురించి తెలుసుకోవడానికి, నా వద్ద ఉన్న అసంపూర్ణ సమాచారాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి నేను రెండేళ్లపాటు నా వృత్తికి విరామం ఇచ్చాను అని ఆమె తెలిపారు. ఈ సమయంలోనే ఆరోగ్య రంగంలో ఉన్న లోపాలు, సమాచార లోపం ఆమెకు అర్థమయ్యాయట. అందుకే తన పోడ్‌కాస్ట్ ద్వారా ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నం మొదలుపెట్టానని, అయితే అలా ప్రశ్నించే సమయంలో తాను ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యానని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు.

వివాదం.. విమర్శలు..

గతంలో 'హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి సమంత చేసిన పోస్ట్ పెద్ద వివాదానికి దారితీసింది. ప్రముఖ వైద్యుడు లివర్‌ డాక్ ఆమెను తీవ్రంగా విమర్శించగా, అది సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికే దారి తీసింది. దీనిపై సమంత స్పందిస్తూ.. నేను ఏదో ఒక చికిత్సను గుడ్డిగా ప్రమోట్ చేయడం లేదు. దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యుల సలహా మేరకే నా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నాను. అందరికీ ఖరీదైన చికిత్సలు అందుబాటులో ఉండవు కదా అన్నదే నా ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు. తను ఎదుర్కొన్న ట్రోలింగ్ వల్ల ఈ రంగంలో నిజాలు మాట్లాడటం ఎంత కష్టమో అర్థమైందని ఆమె అన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా, తన పంథాను మార్చుకోకుండా మహిళల ఆరోగ్యం, స్వయంప్రతిపత్తిపై సమంత పోరాడుతూనే ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమె త్వరలో 'మా ఇంటి బంగారం' చిత్రంతో అలరించబోతున్నారు. అనారోగ్యాన్ని జయించి, విమర్శలను ఎదుర్కొని మళ్లీ కెమెరా ముందుకు వస్తున్న సమంత.. తన మాటలతో, నటనతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.