రెండు కార్లకు ఒకటే నంబర్ ప్లేట్

రెండు కార్లకు ఒకటే నంబర్ ప్లేట్
  • ఐదేళ్లుగా 19 చలాన్లు విధించిన ట్రాఫిక్ పోలీసులు
  • రూ.11065 పెండింగ్ చలాన్లు..7 లీగల్ నోటీసులు
  • సోషల్ మీడియాలో వైరల్

వెహికల్ చెకింగ్స్ లో ఎక్కువ పెండింగ్ చలాన్ లున్న బైక్ పట్టుబడితే ఫైన్ కట్టేవరకు ట్రాఫిక్ పోలీసులు బండిని వదలరు. ఒక్కోసారి కొన్ని వెహికల్స్ ను సీజ్ చేస్తారు. అలాంటిది ఒకే నంబర్ తో రెండు కార్లు తిరుగుతున్నా..ఆ వెహికల్ కు సంబంధించి ఐదేళ్లుగా చలాన్లు పెండింగ్ లో ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఒకే నంబర్ ప్లేట్ తో సిటీలో తిరుగుతున్న రెండు ఆడి కార్లకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

హైదరాబాద్,వెలుగు: సిటీలో ఒకే నంబర్ ప్లేట్ తో రెండు ఆడి కార్లు  షికారు చేస్తున్నాయి. గృహదీపిక బిల్డర్స్ పేరుతో రిజిస్టర్ అయిన  ఏపీ09సీఆర్4959 నంబర్ తో రెండు ఆడి కార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి తెలుపు, మరోటి నలుపు రంగులో తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం  వీటిని గుర్తించలేదు. ఈ కార్లపై 2015 ఆగస్ట్ 14 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 29 వరకు మొత్తం 19 చలాన్లు జనరేట్ అయ్యాయి. వీటిపై మొత్తం ఫైన్ రూ11,065 లు పెండింగ్ లో ఉంది. ఇవి కూడా ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించినవే.  చలాన్ వేశారు..కానీ రెండింటిని గుర్తించలేదు

ఓఆర్ఆర్ తో పాటు పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్ లాంటి ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఈ రెండు ఆడి కార్లకు పోలీసులు రాంగ్ పార్కింగ్ చలాన్ లు విధించారు. ఈ కార్లకు రూల్స్ బ్రేక్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తున్నారు.. కానీ ఆ రెండింటికి ఒకే నంబర్ ప్లేట్ ఉందన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. పెండింగ్ చలాన్లు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న  ఓ ఆడి కార్ నంబర్ పై ఇప్పటికే 7 లీగల్ నోటీసులకు ట్రాఫిక్ పోలీసులు జారీచేశారు. అయితే ఐదేళ్లుగా పెండింగ్ చలాన్లతో తిరుగుతున్న ఈ రెండు ఆడి కార్లను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వెహికల్ చెకింగ్ లో పెండింగ్ చలాన్స్ తో వెహికల్ పట్టుబడితో వెహికల్ సీజ్ చేస్తారు. కానీ ఒకే నంబర్, పెండింగ్ చలాన్లతో ఐదేళ్లుగా తిరుగుతున్న ఈ రెండు ఆడి కార్లపై పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వెహికల్స్​ను సీజ్ చేస్తాం

ఆడి కార్ల విషయం మా దృష్టికివచ్చింది. ఒకే నంబర్ ప్లేట్ తో రెండు కార్లు ఉండటం చట్టవిరుద్ధం. ఇప్పటికే 7 లీగల్ నోటీసులు ఇచ్చాము. వెహికల్ ను సీజ్ చేస్తాం . ట్రాఫిక్ ఈ చలాన్ వింగ్ తో పాటు మా పరిధిలోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అధికారులను అలర్ట్ చేశాం. ఆ కార్లకు సంబంధించి బాధ్యులు ఎవరైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టాం. -విజయ్ కుమార్, డీసీపీ ట్రాఫిక్, సైబరాబాద్