
- నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
శనివారం ఉన్నట్టుండి తగ్గిన ఉష్ణోగ్రతలు ఒక్కరోజులోనే మళ్లీ పెరిగాయి. ఓ వైపు ఎండ కొడుతున్నా ఇంకో వైపు వాన పడింది. ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, గల్ఫ్ ఆఫ్ మార్ట్బన్ నుంచి దక్షిణ కోమోరిన్, మాల్దీవుల వరకు విస్తరించిన షేర్ జోన్లు బలహీనంగా మారడంతోనే ఎండ, వాన పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి, ఉక్కపోతతో జనం ఇబ్బందిపడ్డారు. ఆదిలాబాద్లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 45, ఖమ్మంలో 44.2, నల్గొండలో 43.6, రామగుండంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జనగాం, కామారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వాన పడింది. కొన్ని చోట్ల ఈదురు గాలులకు ఇంటి రేకులు ఎగిరిపోగా, పలు చోట్ల చెట్లు కూలాయి. సోమవారమూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగం)తో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.