శామీర్ పేటలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రారంభం

శామీర్ పేటలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రారంభం

శామీర్ పేట, వెలుగు: శామీర్ పేటలో నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని గురువారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఇన్​స్పెక్టర్ అండ్​జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రజల సౌకర్యార్థం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఓఆర్అర్ సమీపంలో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్​స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఆర్వో అశోక్ కుమార్, సబ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు. 

వివాదాల మధ్య..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభంలో వివాదం నెలకొంది. దాతల పేర్లు వేయలేదని కొందరు, ఆ స్థలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్వహించొద్దని మరికొందరు గొడవ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఈ గొడవ జరగడంతో కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించాలని ఓ నేత డిమాండ్​ చేయడంతో వివాదం మొదలైంది. దాతలను ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ నాయకుడు సుదర్శన్ ప్రశ్నించారు.