జనంలోకి..సమ్మక్క..చిలుకలగుట్ట దిగి..మేడారం గద్దెనెక్కిన తల్లి

జనంలోకి..సమ్మక్క..చిలుకలగుట్ట దిగి..మేడారం గద్దెనెక్కిన తల్లి

మేడారం, వెలుగుచిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని పూజారులు మేడారం గద్దెపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు. సమ్మక్కను గద్దెపైకి చేర్చేందుకు గురువారం తెల్లవారుజాము నుంచే పూజారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకే వనం గుట్టకు వెళ్లి కంకవనం (వెదురు కట్టెలు) తెచ్చి డోలువాయిద్యాల మోతల నడుమ గద్దెపై అమర్చారు. అటు తర్వాత పూజారులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీ దేవరలు గుడికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడి నుంచి వడేరాలు(కుండలు) తీసుకొచ్చి గద్దెపై ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలకు పూజారులు అమ్మవారిని తెచ్చేందుకు చిలుకలగుట్టకు వెళ్లారు. తల్లిని గద్దెకు తీసుకొచ్చే దారిలో సుమారు 2 కిలోమీటర్ల పొడవునా మహిళలు రంగు రంగుల ముగ్గులు వేశారు. వాటిపై శివసత్తులు పూనకాలతో నృత్యం చేశారు.

అమ్మ రాకకు సూచనగా గాల్లోకి కాల్పులు

సమ్కక్కను గద్దెకు తీసుకురావడానికి ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరికొందరు పూజారులు చిలుకలగుట్టపైకి వెళ్లి సుమారు 2 గంటల పాటు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ రూపంలో అమ్మవారిని కుంకుమ భరిణెలో పెట్టుకొని కొక్కెర కృష్ణయ్య గుట్టపై నుంచి కిందికి వచ్చారు. ఆ టైంలో అక్కడే ఉన్న ఎస్పీ సంగ్రామ్‌‌‌‌సింగ్‌‌‌‌ పాటిల్‌‌ ‌‌సమ్మక్క రాకకు సూచనగా ఏకే 47 తుపాకీతో గాల్లోకి  కాల్పులు జరిపారు. ఇది విన్న భక్తులు పెద్ద ఎత్తున సమ్మక్క నామస్మరణ చేశారు. చిలుకలగుట్ట నుంచి తల్లిని తీసుకువచ్చే దృశ్యాన్ని చూసేందుకు జనం పోటీపడ్డారు. కొందరు యువకులు చెట్లపైకి ఎక్కారు. సమ్మక్కను తీసుకువస్తున్న పూజారి కృష్ణయ్యను తాకడానికి చాలా మంది ప్రయత్నించారు. ఆయనకు రక్షణగా పోలీసులు నాలుగంచెల భద్రత ఏర్పాటుచేశారు. రోప్‌‌‌‌ పార్టీ సాయంతో చాలా వేగంగా పూజారి నడుచుకుంటూ చిలుకలగుట్ట నుంచి నేరుగా సమ్మక్క దేవాలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, మేడారంలోని గద్దెపైకి అమ్మను చేర్చారు. గురువారం ఒక్కరోజే 40 లక్షల మంది వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. శుక్రవారం రోజుంతా వన దేవతలు మేడారం గద్దెలపైనుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.