
భారతీయ స్టార్టప్ సీఈవో ఒక అభ్యర్థికి ఆఫర్ చేసిన రూ.22 లక్షల వార్షిక ప్యాకేజీ ఉద్యోగాన్ని వెనక్కి తీసుకోవటం ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వృత్తిపరంగా అవసరమైన స్కిల్స్ ప్రదర్శించాడు. ఉద్యోగం సంపాదించాడు. అయితే అభ్యర్థి తన లింక్డ్‌ఇన్ ఖాతాలో మతాలను అవమానించే విధంగా చేసిన కామెంట్స్ చేయటం గమనించిన స్టార్టప్ వ్యవస్థాపకుడు వెంటనే తమ జాబ్ ఆఫర్ రిజెక్ట్ చేశారు.
వాస్తవానికి చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఎవ్వరూ సెలక్ట్ కాని సమయంలో ఈ అభ్యర్థి తమను సంప్రదించినట్లు జాబీ వ్యవస్థాపకుడు మెుహమద్ అహ్మద్ భాటి చెప్పారు. చాలా మంది జూనియర్ డెవలపర్ పోస్టుకు వచ్చిన అభ్యర్థులు ఎక్కువగా ఏఐపై ఆధారపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసలు తాము చేస్తున్న పనికి వెనుక ఉన్న లాజిక్ కూడా తెలుసుకోకుండా వారు కాపీ పేస్ట్ చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
దీని తర్వాత వచ్చిన వ్యక్తి ఎంపికయ్యాడని, తాము ఆఫర్ లెటర్ కూడా అందించినట్లు కంపెనీ చెప్పింది. వాస్తవంగా తాము అనుకున్న బడ్జెట్ కంటే కూడా రెండు లక్షలు ఎక్కువ ప్యాకేజీని అందించామని వారు చెప్పారు. అయితే ఎంత స్కిల్ ఉన్నప్పటికీ కనీస ఇంగితం లేనివారికి తమ కంపెనీలో ఉద్యోగం ఇవ్వబోమని తాజాగా ఆఫర్ రిజెక్ట్ చేయటంపై కంపెనీ చెబుతోంది. ఎంపికైన అభ్యర్థి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసినప్పుడు తమను నిరాశకు గురిచేశాయని చెప్పింది. లింక్డిన్ ఖాతాలో చేసిన పబ్లిక్ పోస్టులు మతపరమైన నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని కంపెనీ గుర్తించటం వల్లే ఆఫర్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చినట్లు తేలింది.
అయితే కంపెనీ తీసుకున్న చర్యలపై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రియాక్షన్ కనిపించింది. సోషల్ ఖాతాల్లో పోస్టుల ఆధారంగా ఉద్యోగ అవకాశాన్ని వెనక్కి తీసుకోవటం సరికాదని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.