బీజేపీకి ఓటేస్తే ధర్మాన్ని గెలిపించినట్టే  :   అన్నామలై 

బీజేపీకి ఓటేస్తే ధర్మాన్ని గెలిపించినట్టే  :   అన్నామలై 

జీడిమెట్ల, వెలుగు: బీజేపీకి ఓటు వేస్తే ధర్మానికి వేసి గెలిపించినట్లేనని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు.  కుత్బుల్లాపూర్​ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​కు మద్దతుగా ఆయన బుధవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించాలన్నా, సనాతన హిందు ధర్మాన్ని కాపాడాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. కూన శ్రీశైలంగౌడ్​ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి తపించే వ్యక్తి అని, ఆయనకు మద్దతుగా ప్రచారానికి వచ్చానని తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ​కుటుంబ పార్టీలని, బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ అని ఆయన పేర్కొన్నారు.  కుత్బుల్లాపూర్​ 131 డివిజన్​లో, దుండిగల్​ మున్సిపాలిటీలో చేపట్టిన ప్రచారానికి భారీగా ప్రజలు తరలివచ్చి శ్రీశైలంగౌడ్​కి మద్దతు తెలిపారు. కూన శ్రీశైలంగౌడ్​ మాట్లాడుతూ..  కాంగ్రెస్​ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆ పార్టీకి ఓట్లేస్తే..  ఎన్నికలయ్యాక బీఆర్ఎస్ లో​ చేరతారన్నారు.  తనని గెలిపిస్తే కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని, జీడిమెట్ల ఈఎస్ఐ ఆస్పత్రిని ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారు.  ఐడీపీఎస్​ చౌరస్తా నుంచి గండి మైసమ్మ వరకు ఫ్లై ఓవర్​ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.