ప్రజలను విభజించే సనాతనాన్ని నిర్ములించాలి: మరోసారి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

ప్రజలను విభజించే సనాతనాన్ని నిర్ములించాలి: మరోసారి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్ములించాలని అన్నారు ఉదయనిధి స్టాలిన్. గతంలో కూడా ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మాన్ని నిర్ములించాలని అనడం చర్చనీయాంశం అయ్యింది. మంగళవారం ( మే 12 ) తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి.

ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడుతూ... తమిళనాడు రాష్ట్ర గీతం " తమిళ్ వాయ్ వాళుత్తు" ను పక్కన పెట్టాలని చుస్తే సహించబోమని అన్నారు ఉదయనిధి. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని తప్పకుండ నిర్ములించాలని అన్నారు. ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గీతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మూడో స్థానానికి నెట్టేశారని అన్నారు. ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో అలా జరగడం పొరపాటని.. ఈ అసెంబ్లీలో మళ్ళీ అలా జరగడానికి వీల్లేదని అన్నారు ఉదయనిధి.

అసెంబ్లీలోనే కాకుండా తమిళనాడులో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలో అయినా రాష్ట్ర గీతానికి ఎల్లప్పుడూ ప్రధమ స్థానం కల్పించాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా మన హక్కులు, సంప్రదాయాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

మూడేళ్ళ క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పాద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కున్న ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే చేతిలో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకోగా, డీఎంకే కేవలం 59 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.