
సికింద్రాబాద్, వెలుగు : ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలను సనత్ నగర్ సెగ్మెంట్‌కు ఏం చేశారో అడిగి నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనాలను కోరారు. అమీర్ పేట డివిజన్ బాపు నగర్‌కు చెందిన సుమారు 50 మంది వెస్ట్ మారేడ్‌పల్లిలోని తలసాని శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సనత్‌నగర్ సెగ్మెంట్లో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కరించామన్నారు.
బాపునగర్ వాసులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు చేపట్టి ఇబ్బందులను దూరం చేశామన్నారు. బాపునగర్తో పాటు సెగ్మెంట్లోని బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా జనం అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని.. ఇప్పుడు ఏదో చేస్తామంటే జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పగలరా? అని తలసాని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బాపునగర్ అధ్యక్షుడు హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.