బస్తీల్లో అభివృద్ధే లక్ష్యం : కోట నీలిమ

బస్తీల్లో అభివృద్ధే లక్ష్యం :  కోట నీలిమ

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన అంతం కానుందని సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సనత్ నగర్ సెగ్మెంట్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని పాన్ బజార్ ఏరియాలో కోటా అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. సనత్ నగర్ సెగ్మెంట్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో జనాల్లోకి వెళ్తున్నామన్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సెగ్మెంట్ లోని బస్తీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. తనను గెలిపిస్తే బస్తీల్లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. 50 ఏండ్లలో జరగని పనులు పదేళ్లలో చేశామంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సెగ్మెంట్ లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని ఆమె సవాల్ విసిరారు. ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ సీనియర్ నేత శీలం ప్రభాకర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. శీలం ప్రభాకర్​ మృతి కాంగ్రెస్​ పార్టీకి తీరని లోటని కోట నీలిమ తెలిపారు.

ALSO READ: పదేండ్ల తెలంగాణ  పాలన ఆగమాగం