పదేండ్ల తెలంగాణ  పాలన ఆగమాగం

పదేండ్ల తెలంగాణ  పాలన ఆగమాగం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ ప్రజల కష్టాలు తీరకపోగా మరింత పెరిగినాయి. యువతకు ఉపాధి దొరకడం కష్టం అయితున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్య నిర్లక్ష్యానికి గురి అవడంతో స్కూళ్లు మూతపడుతున్నాయి. విశ్వవిద్యాలయాలకు నిధులు లేవు. చదువు చెప్పే ఆచార్యులు లేరు. సర్కారు  ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ వైద్యం కూడా అధ్వానంగా మారి ప్రైవేటు ఆసుపత్రులు పెరుగుతున్నాయి.

వాటి మీద సర్కారు నియంత్రణ లేదు. పారిశ్రామిక ఉత్పత్తి కొరవడటంతోపాటు కాలుష్యం పెరుగుతున్నది. చెరువుల ఆక్రమణ ఎక్కువ అయ్యింది. మిషన్ కాకతీయ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆదాయ వనరుగా మారగా భూకబ్జాలకు దగ్గర దారిగా మారింది. రియల్ ఎస్టేట్ మీద ప్రభుత్వ పెద్దల దృష్టి ఉండడంతో  సామాన్యుల భూములు చేతులు మారుతున్నాయి. భూమి లేని పేదల సంఖ్య రాష్ట్రంలో  పెరుగుతున్నది. భూమిని నమ్ముకున్న వారిని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం ఉమ్మడి ఆస్తులుగా భావించే భూములను ప్రైవేటు పరం చేస్తున్నది. మైనింగ్ పేరిట గుట్టలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. అకాలవర్షాలు అన్ని వర్గాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలలో వరదలు పేదలకు శాపంగా మారినాయి.

తెలంగాణ  ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ తమ  సర్కారు లక్ష్యంగా ప్రకటించింది. అయితే ఇది కేవలం నినాదంగానే మిగిలింది. ప్రభుత్వ పెద్దలు ఈ నినాదం వల్లె వేస్తున్నపుడల్లా, సామాన్యులు అది ఒక సుపరిపాలనకు దారి తీస్తుందని భావించారు. ప్రత్యేక రాష్ట్రంలో మెరుగైన పాలన ఉంటుంది అని ఆశించారు.  మనం చేపట్టే కార్యక్రమాలకు తగినంత ప్రభుత్వ సిబ్బంది లేరు,  అవసరమైన మేరకు ఐఏఎస్ ఆఫీసర్లు తక్కువ ఉన్నారు అని  తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు.

గత పదేండ్ల పాలనలో తగినంత సిబ్బందిని సమకూర్చుకోవడంలో,  ప్రభుత్వ పని తీరు మెరుగుపరచడంలో, అవినీతి తగ్గించడంలో ఎన్నికైన రాజకీయ నాయకత్వం విఫలం అయ్యింది.  ఉద్యోగ సంఘాలను తన దారిలోకి తెచ్చుకోవటానికి ముఖ్యమంత్రి పెట్టిన శ్రద్ధ.. ఉద్యోగులను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చటంలో పెట్టలేదు. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ పాలనలో ఉన్న సంప్రదాయాలను, మార్గదర్శకాలను, నిబంధనలను అన్నింటిని తుంగలో తొక్కిన  సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత అజమాయిషీతో గందరగోళం సృష్టించినారు. సుపరిపాలన సంగతి పక్కన పెడితే, అనేక విషయాలలో ఇదేమి పాలన అనే సందేహాలే పెరిగాయి.

నియామకాలు నిల్.. జీతభత్యాల ఖర్చు ఫుల్​

 ఏటా దాదాపు 3 శాతం ప్రభుత్వ ఉద్యోగులు వయసు రీత్యా ఉద్యోగ విరమణ చేస్తున్నారు. అయినా కూడా ఉద్యోగ జీతభత్యాల ఖర్చు ఏమాత్రం తక్కువ కావడం లేదు. 2014లో ఎంత ఖర్చు అయ్యిందో 2021లో అంతకంటే ఎక్కువ  అయ్యింది. 2021 లో జీతభత్యాల మీద అయిన ఖర్చు రూ.25 వేల కోట్లు దాటింది. వారికి పింఛన్లు జత చేస్తే మొత్తం దాదాపు రూ.40 వేల కోట్లు. 2016-–17 లో జీతభత్యాల మీద అయిన ఖర్చు రూ.21,897 కోట్లు. 2014–-15 లో జీతభత్యాల మీద అయిన ఖర్చు రూ.12,134 కోట్లు ఖర్చవగా, పించన్లకు రూ.4,210 కోట్లు మాత్రమే. ఇది ఎలా సాధ్యం? ఉద్యోగుల సంఖ్య పెరగకున్నా జీతాల ఖర్చు పెరుగుతున్నది.

పెంచిన వేతనాల వల్ల ఈ పెరుగుదల అనుకున్నా, ప్రభుత్వ ఉద్యోగుల నిర్వహణలో ఉన్న అనేక మతలబులకు కూడా ఇది సంకేతం. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు పెరిగినా..ఒక సాధారణ పౌరుడికి కావాల్సిన సేవలు అందించడంలో తీవ్ర లోపాలు ఉండటంతో ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. భూమికి సంబంధించిన శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు దాదాపు లేరు. ధరణి పేరుతో ఇప్పుడు రైతులు జిల్లాలు లేదా రాజధానికి రావాల్సి వస్తున్నది. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు లేరు, కనీసం చెప్పేవారు లేరు. వికలాంగుల పింఛన్ కోసం ప్రగతి భవన్ దాకా రావాల్సిన పరిస్థితి కల్పించారు. దాదాపు 2 ఏండ్లు అసలు సచివాలయమే లేదు. ఆగమేఘాల మీద కట్టిన కొత్త భవనం ఇప్పుడు ప్రజలకు కూడా అందుబాటులో లేదు.

సామాన్యులకు దూరంగా ఆఫీసులు

తెలంగాణలో కొత్తగా 60 దాక మండలాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఇప్పుడు 620 వరకు ఉన్నాయి. కానీ, మండల ఆఫీసులకు భవనాలు లేవు. ఆఫీసులు ఉన్నా ఉద్యోగులు లేరు. ఉద్యోగులు ఉన్నా వారికి తగిన పని లేదు. పథకాల అమలు ఎమ్మెల్యేలే  నిర్ణయిస్తుంటే ఇక ఉద్యోగులు చేసేది ఏమీ ఉండదు. ప్రతి రోజూ అక్కడ, ఇక్కడ  జరిగే మీటింగ్​లకు మాత్రం పోతుంటారు. మండల ఆఫీసుల దగ్గర సమాచారం లేదు, నిధులు లేవు. నిత్యం జిల్లా ఆఫీసులకు రావాల్సిందే.

అక్కడ కూడా పని అయ్యే అవకాశాలు లేవు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయినా జిల్లా స్థాయి అధికారులు అన్ని శాఖలలో లేరు. ప్రజలతో నేరుగా పని చేయాల్సిన రెవెన్యూ, వ్యవసాయం, విద్య, వైద్య శాఖల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. ఇదివరకు జిల్లా కలెక్టరు కేంద్రంగా ప్రభుత్వ పాలన ప్రజలకు అందుబాటులో ఉండేది. 10 నుంచి 33 జిల్లాలు అయినాక 33 జిల్లా కలెక్టర్లు, వారికి తోడు అదనపు కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 66 యువ అధికారులు ఉండి కూడా పాలన సజావుగా లేదు. జిల్లా కలెక్టరు ఆఫీసులు కొన్ని ఆడంబరంగా కట్టి సమీకృత భవనాలు పేరిట అన్నింటిని ఒకే దగ్గర చేర్చి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.

రవాణా సదుపాయాలు లేని చోట కట్టడం వల్ల చుట్టు పక్కల భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం ఊపు వచ్చింది.  సామాన్యులకు ప్రభుత్వ ఆఫీసులు దూరం అయినాయి. నిత్యం తిరగాల్సి రావటం, రవాణా ఖర్చులు భారంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఎదుర్కొంటున్న పరిస్థితులకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వ పాలన జరుగుతోంది. 

పాలనలో రాజకీయ ప్రమేయం

ప్రభుత్వ శాఖల నిర్వహణ రాజధాని హైదరాబాద్​లో కేంద్రీకృతం అవుతున్నది. అవసరం మేరకు ఉద్యోగులు లేకపోవడం, కొన్ని శాఖలలో సంఖ్య తగ్గడం, డిజిటలీకరణ పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి దూరం అవుతున్నది. 12 నుంచి 15 మంది కేబినెట్ హోదా సలహాదారులు దాదాపు అందరూ రిటైర్ అయిన ఉద్యోగులే, ముఖ్యమంత్రి ఆఫీసులో ఆరుగురు ఆఫీసర్ల మధ్య అనేక శాఖల విభజన వంటివి కేంద్రీకృత పాలనకు సంకేతాలు. సచివాలయంలో రెవెన్యూశాఖ ఉద్యోగులు 2015లో 86 ఉంటే 121కి పెరిగిండ్రు.

భూ పరిపాలనశాఖలో 2015లో 45,520 ఉద్యోగులు ఉంటే అది 2023-–24లో 9,853కి పడిపోయింది. ఉద్యానవన శాఖలో 863 నుంచి 802 కు పడిపోయింది. వార్షిక బడ్జెట్లో నిధులు అసలే ఇవ్వని సెరికల్చర్ శాఖలో 722 నుంచి 742 పెరిగిండ్రు. ఒక శాఖలో ఉద్యోగులు ఎక్కువ. ఇంకో దగ్గర అసలే ఉండరు. పథకాల అమలు శాఖల అధిపతులకు కాకుండా ఎమ్మెల్యేలకు అప్పజెప్పడానికి ఉద్యోగుల లేమి కూడా ఒక కారణం కావచ్చు. లబ్ధిదారుల ఎంపిక ఇదివరకు అన్ని శాఖలకు ఒక ప్రక్రియ. ఇప్పుడు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల సూచనల మేరకు పనులు జరుగుతున్నవి. పరిపాలన ప్రక్రియను రాజకీయ ప్రక్రియగా మార్చేసింది తెలంగాణా ప్రభుత్వం.

ప్రభుత్వ పాలన ప్రైవేటీకరణ

కంప్యూటర్ల ద్వారా పరిపాలన సజావుగా ఉంటుందని భావించిన ప్రభుత్వం, ఆ మేరకు పరిపాలన ప్రక్రియలలో పౌరులకు అనుకూలమైన మార్పులు తీసుకురాలేదు. డిజిటలీకరణ వలన పారదర్శకత లోపించింది. ప్రభుత్వ సమాచారం కేంద్రీకృతం చేసి ఎవరికీ అందకుండా పథకాలను అమలు చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించుకున్నది. రైతుల రుణమాఫీ పథకంలో 35 లక్షల ఖాతాలు ఉన్నాయని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క ఖాతా సమాచారం కూడా ప్రజల ముందు పెట్టలేదు . రైతుబంధు నేరుగా రైతులకు అందిస్తున్నామంటున్న తెలంగాణ  ప్రభుత్వం లబ్ధిదారుల చిట్టా ఇప్పటివరకూ బయటపెట్టలేదు.

పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో అనుసరించిన విధానాలు కూడా పారదర్శకంగా లేవు. ధరణి రికార్డులు కంప్యూటర్ ఆపరేటర్లు, వారిని నియమించిన వారి చేతులలో ఉన్నాయి.  ఇదివరకు పహాణీ కాగితం చూసే భాగ్యం ఉండేది. ఇప్పుడు ఆపరేటర్ ఏమి చెబితే అదే రికార్డు.  భారత రాజ్యాంగం అవినీతి జరగకుండా ప్రభుత్వ కార్యకలాపాల మీద అనేక రకాల అజమాయిషీని రూపొందిస్తే, డిజిటలీకరణ వాటి అన్నింటిని తుంగలోకి తొక్కింది. ప్రభుత్వ సమాచారం అస్మదీయ, ప్రైవేటు వ్యక్తులకు చాలా సులభంగా కంప్యూటరీకరణ ద్వారా అందుబాటులోకి వచ్చింది. 

ప్రభుత్వ నియంత్రణ నిర్వీర్యం

తెలంగాణ ఆర్థిక అభివృద్ధి మీద పరిశోధన కూడా స్థానిక సంస్థకు ఇవ్వకుండా వేరే ప్రైవేటు సంస్థకు ఇచ్చారు. ఒక ప్రైవేటు సంస్థ తమ ఉద్యోగులను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక విభాగాలలో ఉంచి 2019 నుంచి ఒక ఐదేండ్ల కాల పరిమితి ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ ఖర్చు ‘నాణ్యత’ పెంచే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఇటువంటి ఎన్ని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంలో ఉన్నాయో ప్రజలకు తెలవదు. ఇది కూడా ఆ సంస్థ ప్రకటిస్తేనే జనాలకు తెలిసింది.

ALSO READ: గాజా ఆస్పత్రిలో ఆయుధాల డంప్ .. 

తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది ప్రైవేటు వ్యక్తులు, ఎన్ని ప్రైవేటు సంస్థలు పని చేస్తున్నాయో ప్రభుత్వం ఏనాడూ ప్రకటించలేదు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు మాత్రం నిర్వీర్యం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ కాలుష్య నియత్రణ మండలిలో 2014-–15లో ఉన్న సిబ్బంది సంఖ్య 144.  దాదాపు 13 చట్టాలను అమలు చేయాల్సిన ఈ సంస్థ సిబ్బంది సంఖ్య పెరగాల్సింది పోయి ఇంకా తగ్గింది.  దీంతో కాలుష్యం విస్తృతంగా పెరుగుతున్నది. నీటి కాలుష్యం అనేక ప్రాంతాలలో తీవ్రంగా ఉంది. గాలి కాలుష్యం అన్ని పట్టణాలలో పెరుగుతున్నది. ఆహారం కల్తీ పెరుగుతున్నా.. ఆహార నాణ్యత నియంత్రణ ఇప్పటికీ పాత పద్ధతిలోనే నడుస్తున్నది. కాగా, ప్రజలకు దూరంగా తెలంగాణ ప్రభుత్వ పాలన ఉండడం శోచనీయం. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాలన అందిస్తే బాగుంటుంది. ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త  ప్రభుత్వమైనా సుపరిపాలనకు బాటలు వేస్తుందని ఆశిద్దాం.

- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్