జీవితం అందరికీ గోల్డెన్ స్పూన్‌తో మొదలవ్వదు. కొందరికి ఖాళీ గిన్నెతో మొదలవుతుంది. కానీ ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు.. ఎంత ధైర్యంతో ముందుకు సాగామన్నదే ముఖ్యం అని నిరూపించారు వ్యాపారవేత్త రేణుక ఆరాధ్య. ఒకప్పుడు తిండి కోసం అడుక్కుని, శవాలను మోసిన చేతులతోనే నేడు వందల మందికి ఉపాధినిస్తూ రూ.40 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని విజయవంతంగా నడుపుతున్నారు. ఆకలి కేకల నుంచి పుట్టిన ఆయన సక్సెస్ స్టోరీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
కర్ణాటక బెంగళూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో రేణుక జన్మించారు. ఆయన తండ్రి ఆలయ పూజారి. కుటుంబం గడవడానికి ఆయన తండ్రితో కలిసి గ్రామంలో భిక్షాటన చేసేవారు. చదువుకోవడానికి కూడా స్తోమత లేక, ఇళ్లు క్లీన్ చేయటం, ఊడ్చడం వంటి పనులు చేస్తూ.. అలాగే టీచర్లు కట్టిన ఫీజుతో 6వ తరగతి పూర్తి చేశారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత.. తండ్రి మరణంతో కుటుంబ భారం మొత్తం భుజాన పడింది.
తండ్రి మరణం తర్వాత బ్రతుకు తెరువు కోసం రేణుక చేయని పని లేదు. సెక్యూరిటీ గార్డుగా, ఫ్యాక్టరీలో స్వీపర్‌గా, ఐస్ ప్లాంట్ కార్మికుడిగా ఇలా చాలా పనులు చేశారు. చివరకు కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోసినందుకు ఒక్కో చెట్టుకు 15 రూపాయలు సంపాదించేవారు. డ్రైవర్ కావాలనే కోరికతో పెళ్లి ఉంగరాన్ని తాకట్టు పెట్టి లైసెన్స్ తీసుకున్నారు. కానీ డ్రైవింగ్ సరిగ్గా రాక మొదటి రోజే కారును గుద్దేయడంతో ఉద్యోగం పోయింది. అయినా వెనకడుగు వేయకుండా రాత్రిపూట రహస్యంగా ప్రాక్టీస్ చేస్తూ డ్రైవింగ్‌లో పట్టు సాధించారు.
డ్రైవర్‌గా ఉన్నప్పుడు దాదాపు 300 శవాలను తరలించారు. ఆ అనుభవం ఆయనకు జీవితం అంటే ఏమిటో నేర్పింది. టూరిస్టులను తీసుకెళ్లేటప్పుడు వారిచ్చే టిప్పులను జాగ్రత్తగా దాచి, భార్య పొదుపు చేసిన డబ్బుతో 2006లో 'ప్రవాసి క్యాబ్స్' అనే చిన్న టాక్సీ బిజినెస్‌ను ప్రారంభించారు. తన వద్ద ఉన్న కార్లను అమ్మి పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు ఆ సంస్థ వద్ద 1000కి పైగా వాహనాలు ఉన్నాయి. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ సంస్థలే ఆయన క్లయింట్లు.
పర్యాటకుల కోసం ఎదురుచూసే సమయంలో పేపర్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. లాభం కంటే టర్నోవర్ మీద, నాణ్యమైన సర్వీస్ మీద దృష్టి పెట్టారు. గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు.. కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటే ఆకాశమే హద్దు అని రేణుక ఆరాధ్య నిరూపించారు. నేడు ఆయన సక్సెస్ స్టోరీ కోట్లాది మంది యువతకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని దాటడం కోసం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లటానికి గుండె ధైర్యం ఈ సమాజంలో ఎంత ముఖ్యమో ఆయన ప్రయాణం నేర్పిస్తుంది.
