గాజా ఆస్పత్రిలో ఆయుధాల డంప్ ..

గాజా ఆస్పత్రిలో ఆయుధాల డంప్ ..

గాజా/జెరూసలెం:  గాజాలోని చాలా హాస్పిటల్స్​లో హమాస్ టెర్రరిస్టులు భారీ ఎత్తున ఆయుధాలు దాచి పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ హమాస్ మిలిటెంట్లు హాస్పిటల్స్​ను షెల్టర్స్​గా వాడుకుంటున్నారని విమర్శించింది. గురువారం గాజాలోని అల్- షిఫా హాస్పిటల్ ఎంఆర్ఐ యూనిట్ నుంచి ఆయుధాలతో పాటు టెక్నికల్ ఎక్విప్​మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. 

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హాస్పిటల్​ను హమాస్ తన కమాండ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌గా ఉపయోగిస్తున్నదని ఐడీఎఫ్ తెలిపింది. అల్ షిఫా హాస్పిటల్ మొత్తాన్ని ఇజ్రాయెల్ సైన్యం తనిఖీ చేస్తున్నది. ఈ హాస్పిటల్ కింద ఉన్న టన్నెల్​లోనే హమాస్​ మిలిటెంట్లు తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నది. అయితే, ఇజ్రాయెల్ బలగాలు హాస్పిటల్ సౌత్ ఎంట్రెన్స్​ను బుల్డోజర్​తో ధ్వంసం చేసినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. 

నాలుగు పట్టణాలు ఖాళీ చేయండి

గాజా ఈస్ట్​లో ఉన్న బని షుహైలా, ఖుజా, అబాసన్, కరారా సిటీలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ బలగాలు విమానం నుంచి పాంప్లెట్స్ జారవిడిచాయి. హమాస్ దాడులకు ముందు ఈ పట్టణాల్లో లక్షకు పైగా ప్రజలు నివసించేవాళ్లు. ఇప్పుడు 10 వేల మంది వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. హమాస్​ మిలిటెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుంచి వాళ్లను వెళ్లగొట్టాల్సిందిగా పాంప్లెట్స్ లో ఇజ్రాయెల్ కోరింది. సేఫ్ గా ఉండాలంటే వెంటనే ఇండ్లు విడిచి దగ్గర్లోని షెల్టర్స్​కు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఖాన్ యూనిస్ ఏరియాలో ఉంటున్న వాళ్లు కూడా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది.

హమాస్ పొలిటికల్ చీఫ్ ఇంటిపై దాడి 

హమాస్‌‌‌‌ కీలక నేత, పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్‌‌‌‌ హనియే ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో హనియే ఇల్లు మొత్తం ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ గురువారం రిలీజ్ చేసింది. చాలా దేశాలు హనియేను హమాస్ చీఫ్​గా పేర్కొంటాయి. హనియే ఇల్లు టెర్రరిస్ట్​లకు మెయిన్ షెల్టర్ అని ఐడీఎఫ్ ప్రకటించింది.

ALSO READ: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్​ మోడల్ : తలసాని

 ఇజ్రాయెల్ ఆర్మీపై దాడులకు సంబంధించిన వ్యూహాలు కూడా ఇక్కడి నుంచే అమలుచేస్తారని తెలిపింది. హమాస్ లీడర్లంతా ఇక్కడే భేటీ అవుతుంటారని కూడా పేర్కొంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా దాడులు చేయాలన్న ఆదేశాలన్నీ హనియే ఇంటి నుంచే వెళ్తాయని పేర్కొంది. ఇస్మాయిల్ హనియే ఇల్లు మొత్తం నేలమట్టం చేసినట్లు ప్రకటించింది. అయితే, దాడి టైమ్​లో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అన్నదానిపై మాత్రం ఐడీఎఫ్ క్లారిటీ ఇవ్వలేదు.