మెగా గేమ్స్ జోష్.. వరల్డ్ కప్స్ కిక్.. కిక్కిరిసిన స్పోర్టింగ్ ఈవెంట్లతో 2026 రెడీ !

మెగా గేమ్స్ జోష్.. వరల్డ్ కప్స్ కిక్.. కిక్కిరిసిన స్పోర్టింగ్ ఈవెంట్లతో 2026 రెడీ !

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్)

మన జనం మెచ్చిన క్రికెట్‌‌‌‌లో వన్డే వరల్డ్ కప్‌‌‌‌, చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ, ఆసియా కప్‌‌‌‌లు అందిస్తూ.. మరెన్నో  చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ముగిసింది. ప్రపంచ క్రీడా యవనికపై ఇండియా మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు ఇంకో ఏడాది సిద్ధమైంది. 2025 విజయాల స్ఫూర్తితో 2026లో ముచ్చటగా మూడు క్రికెట్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లు, మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్స్‌‌‌‌ కామన్వెల్త్‌‌‌‌, ఆసియా గేమ్స్ సంగ్రామం.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించే కీలక ఘట్టాలతో కొత్త  స్పోర్ట్స్‌‌‌‌ క్యాలెండర్ కిక్కిరిసిపోయింది. వీటికి తోడు  ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌  సాకర్ ఫ్యాన్స్‌‌‌‌కు  కిక్ ఇవ్వనుంది. క్రికెట్ గ్రౌండ్ నుంచి చెస్ బోర్డు వరకు, అథ్లెటిక్స్ ట్రాక్ నుంచి హాకీ టర్ఫ్ వరకు మన క్రీడాకారులు అగ్నిపరీక్షను ఎదుర్కోబోతుండగా.. ఈ ఏడాది జరిగే  ముఖ్యమైన స్పోర్టింగ్ ఈవెంట్లపై ఓ లుక్కేద్దాం. 

క్రికెట్ వరల్డ్ కప్స్  తీన్‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌ 

ఈ ఏడాది ఆరంభమే క్రికెట్ అభిమానులకు పండుగలా ఉండబోతోంది. తొలి మూడు నెలల్లోనే రెండు సహా మొత్తంగా మూడు వరల్డ్ కప్స్‌‌‌‌ క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌ను ఉర్రూతలూగించనున్నాయి.  జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే , నమీబియా వేదికగా అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌‌‌‌ జరగనుంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి యువ సంచలనాలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

 అసలైన కిక్‌‌‌‌ ఫిబ్రవరిలో షురూ అవుతుంది. స్వదేశంలో ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌గా బరిలోకి దిగనుంది. శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తున్న టోర్నీలో టీమిండియా టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. 

జూన్‌‌‌‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగే విమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో హర్మన్‌‌‌‌ప్రీత్ సేన మరో  కప్‌‌‌‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. గతేడాది వన్డే వరల్డ్‌‌‌‌ కప్ గెలిచిన ఊపులో ఉన్న అమ్మాయిల జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విమెన్స్ ప్రీమియర్ లీగ్ హంగామా జనవరి 9 నుంచే మొదలవనుండగా..  సమ్మర్‌‌‌‌ క్రికెట్ కార్నివాల్ ఐపీఎల్ మార్చి 26న మొదలై మే 31 వరకు సందడి చేయనుంది.

అండర్-19 వన్డే వరల్డ్ కప్
(జనవరి 15 - ఫిబ్రవరి 6 
జింబాబ్వే, నమీబియా)
మెన్స్ టీ20 వరల్డ్‌‌‌‌ కప్
(ఫిబ్రవరి 7- మార్చి 8 
ఇండియా, శ్రీలంక)
విమెన్స్ టీ20 వరల్డ్‌‌‌‌ కప్
(జూన్‌‌‌‌ 12-జులై 5: ఇంగ్లండ్)

కళ తప్పిన కామన్వెల్త్  గేమ్స్‌‌‌‌.. 

(జూలై 23- ఆగస్టు 2: గ్లాస్గో) 
ఈ ఏడాది రెండు మెగా కాంటినెంటల్ ఈవెంట్లకు వేదిక కానుంది. అందులో మొదటి కామన్వెల్త్ గేమ్స్. జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో పోటీలు జరుగుతాయి. గతంతో పోలిస్తే అతి తక్కువ క్రీడలు ఉండటంతో ఈసారి కామన్వెల్త్  కళ తప్పింది. బడ్జెట్ కారణాల రీత్యా షూటింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలను తొలగించడంతో ఇండియాకు నిరాశ కలిగించే విషయమే అయినా, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌లో పతకాలు సాధించాలని 
మన అథ్లెట్లు చూస్తున్నారు.

అగ్రరాజ్యంలో సాకర్ మహా సంగ్రామం

ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌ ( జూన్‌‌‌‌ 11-జులై 19:
అమెరికా, కెనడా, మెక్సికో)
నాలుగేండ్లకోసారి సాకర్ అభిమానులను ఉర్రూతలూగించే ఫిపా వరల్డ్ కప్‌‌‌‌ కు ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇవ్వనుండటం మరింత స్పెషల్‌‌‌‌గా మారింది.. యూఎస్‌‌‌‌ఏతో పాటు కెనడా, మెక్సికోలోని 16 సిటీల్లో జరిగే మెగా టోర్నీలో ప్రపంచంలోని 48 అత్యుత్తమ జట్లు తలపడనున్నాయి.

ఆసియా గేమ్స్‌‌‌‌పై అంచనాలు

(సెప్టెంబర్ 19- అక్టోబర్:  జపాన్‌‌‌‌)
కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన వెంటనే ఆసియా గేమ్స్‌‌‌‌పై ఇండియా ఫోకస్ పెట్టనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌‌‌‌లోని ఐచి-నాగోయాలో జరగనున్నాయి. ఈ గేమ్స్‌‌ 2028 ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించడానికి అత్యంత కీలకం కానున్నాయి. హాకీలో స్వర్ణం గెలిచిన జట్టు నేరుగా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధిస్తుంది.

కాండిడేట్స్ చెస్  (మార్చి 28-ఏప్రిల్16:  సైప్రస్‌‌‌‌)

ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌‌‌‌గా ఉన్న గుకేశ్‌‌కు సవాలు విసిరే వారిని 
క్యాండిడేట్స్  టోర్నీ నిర్ణయిస్తుంది. ఇండియా నుంచి ఓపెన్‌‌‌‌లో ప్రజ్ఞానంద, విమెన్స్‌‌లో వైశాలి, కోనేరు హంపి ఇందులో పాల్గొంటారు. సెప్టెంబర్ లో తాష్కెంట్ వేదికగా చెస్ ఒలింపియాడ్ (46వ ఎడిషన్), డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ కూడా చెస్ ఫ్యాన్స్‌‌‌‌ను అలరించనున్నాయి. 

హాకీ వరల్డ్ కప్ 

ఆగస్టు 14 -30: బెల్జియం, నెదర్లాండ్స్
మెన్స్, విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌‌‌‌ బెల్జియం, నెదర్లాండ్స్‌‌‌‌లో జరుగుతుంది. ఆసియా కప్ గెలిచి ఇప్పటికే ఈ టోర్నీకి అర్హత సాధించిన ఇండియా మెన్స్ జట్టుతో పాటు, మార్చిలో జరిగే క్వాలిఫయర్స్ ద్వారా విమెన్స్‌‌‌‌ జట్టు కూడా బెర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తోంది.

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్ 

(ఆగస్టు 17– 23: న్యూఢిల్లీ)
ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. సొంతగడ్డపై మన షట్లర్లు సత్తా చాటే అవకాశం ఉంది.