Sanchar Saathi App: సంచార్ సాతీ యాప్పై జరుగుతున్న వివాదంపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా మెుబైల్ ఫోన్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలనే వార్తలు చాలా మందిని అయోమయానికి, గందరగోళానికి గురిచేశాయి. ప్రస్తుతం దీనిపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యం కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు.
దేశంలోని మొబైల్ తయారీదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు, గోప్యతావాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది పౌరుల వ్యక్తిగత జీవితాలపై పెగాసస్ లాంటి నిఘా అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచార్ సాతీ యాప్ గురించి వివరణ ఇచ్చారు. కొత్త ఫోన్లలో యాప్‌ను ముందే ఇన్ స్టాల్ చేసి ఉంచినప్పటికీ.. దానిని ఉంచుకోవాలా వద్దా అనేది పూర్తిగా యూజర్ల ఎంపికపై ఆదారపడి ఉంటుందని తాజాగా స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టం. వారు ఎప్పుడైనా దీన్ని డిలీట్ చేయవచ్చు. దీన్ని ఉపయోగించాలని ఎవరిపై బలవంతం లేదని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. సైబర్ సెక్యూరిటీ ఉపకరణంగానే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
అసలు సంచార్ సాతీ యాప్ ఏంటి..?
సంచార్ సాతీ అనేది కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ రూపొందించిన ఒక యాప్. ఇది మొబైల్ వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడానికి, మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన వెబ్‌పోర్టల్, మొబైల్ అప్లికేషన్ కలయిక. యాప్ ముఖ్యంగా మూడు ప్రధాన సేవలను అందిస్తుంది.
1. పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను బ్లాక్ చేయడం. దాని IMEI నంబర్‌ను ఉపయోగించి యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఆ ఫోన్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఎవరూ దాన్ని ఉపయోగించకుండా నిరోధించవచ్చు. ఫోన్ తిరిగి దొరికిన తర్వాత దాన్ని అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.
2. స్పామ్ కాల్స్, మోసపూరిత మెసేజ్‌లు లేదా కాల్స్ లాంటి అనుమానాస్పద కమ్యూనికేషన్‌లను యూజర్లు నేరుగా ఈ యాప్ ద్వారా నివేదించవచ్చు.
3. మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవటం. మీ ఆధార్ లేదా గుర్తింపు కార్డుపై ఎన్ని మొబైల్ సిమ్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల మీ పేరు మీద అక్రమంగా తీసుకున్న సిమ్‌లు ఏవైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయమని కోరవచ్చు.
