టీఎంసీ నేతను అరెస్టు చేయండి.. పోలీసులకు కలకత్తా హైకోర్టు ఆదేశం

టీఎంసీ నేతను అరెస్టు చేయండి..  పోలీసులకు కలకత్తా హైకోర్టు ఆదేశం
  • షాజహాన్​ అరెస్టుపై ఎలాంటి స్టే ఇవ్వలేదని వెల్లడి

కోల్ కతా: భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ లీడర్  షేక్  షాజహాన్ ను అరెస్టు చేయాలని బెంగాల్  పోలీసులను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అతని అరెస్టుపై ఎలాంటి స్టే ఇవ్వలేదని న్యాయస్థానం తెలిపింది. ‘‘ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖాలీలో భూములు కబ్జా చేయడంతో పాటు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు షేక్  షాజహాన్ పై ఎఫ్ఐఆర్  నమోదైంది. అప్పటి నుంచి అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. వెంటనే అతనిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది” అని హైకోర్టు పేర్కొంది. 

ఈ కేసు విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. కాగా, బెంగాల్  పోలీసుల చేతులను హైకోర్టు కట్టేసిందని, దీంతో షాజహాన్ ను పోలీసులు అరెస్టు చేయలేకపోతున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్  బెనర్జీ అంతకుముందు అన్నారు. ‘గత నెల 5న రాష్ట్రంలో ఈడీ అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఈడీ ఫిర్యాదు చేయడంతో సిట్  ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాదాపు 10, 12 రోజుల తర్వాత ఈ ఘటనపై ఈడీ అధికారులు స్టే కోరగా హైకోర్టు అంగీకరించింది.  అంటే తమపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో అరెస్టులు జరగకుండా, దర్యాప్తు సాగకుండా ఈడీ అధికారులు కోరుకుంటున్నారా?’ అని అభిషేక్  బెనర్జీ వ్యాఖ్యానించారు. 

ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో షాజహాన్ ను అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై టీఎంసీ నేత డాక్టర్ శంతను సేన్  స్పందిస్తూ.. తమ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. అతడిని అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్  చేస్తున్నారని, రూ.వేల కోట్ల అప్పులు చేసి దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్  మోదీ, మేహుల్  చోక్సీని ఎప్పుడు అరెస్టు చేస్తారని సేన్  ప్రశ్నించారు. వారిని అరెస్టు చేయకుండా స్టే ఎందుకు విధించారని బీజేపీ నేతలు కోర్టును అడగాలని ఆయన సూచించారు.