రూ.4కోట్ల ‘సండ్ర’ స్మగ్లింగ్.. ఖమ్మం, మహబూబాబాద్ సరిహద్దుల్లో అడ్డగోలుగా దందా

రూ.4కోట్ల ‘సండ్ర’ స్మగ్లింగ్.. ఖమ్మం, మహబూబాబాద్ సరిహద్దుల్లో అడ్డగోలుగా దందా
  • అంతర్ జిల్లాల శివారు గ్రామాల్లో విస్తరించిన వ్యాపారం
  • ఆటవీ శాఖ అధికారులకు రూ. లక్షల్లో ముడుపులు
  • డంపింగ్ ఆంతా డోర్నకల్ రేంజ్ పరిధిలోనే..

ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: నకిలీ ఎన్ఓసీలతో రాష్ట్రాలు దాటించిన కలప వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఖమ్మం జిల్లాలో నకిలీ ఎన్ఓసీలు జారీ అయ్యాయే గానీ, ఇక్కడ సండ్ర చెట్లు నరకలేదని ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ్​ విక్రమ్ సింగ్ చెప్తూ వస్తున్నారు. ఫేక్ ఎన్ఓసీలకు బాధ్యులుగా చింతకాని సెక్షన్ ఆఫీసర్, బీటు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. అయితే జిల్లాకు సరిహద్దు గ్రామం ఖమ్మం రూరల్ మండలం కుసుమంచి సెక్షన్ ఆఫీస్ పరిధిలోని మంగళగూడెం, పొలిశెట్టి గూడెం గ్రామాల్లో ప్రైవేటు పట్టా, బీడు భూములలో గత నాలుగు నెలల్లో సుమారు 35 టన్నుల సండ్ర కర్రను నరికి వేశారు. దీంతో అక్కడ చెట్లు పోయి మొదల్లు అనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. టన్ను రూ.20 వేల చొప్పున స్మగ్లర్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. 

సండ్ర కర్ర స్మగ్లర్లు వీరే..!

సండ్ర కర్రను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రేంజ్ సెక్షన్ తోడేళ్లగూడెం, మన్నెగూడెం, సీరోలు, ఖమ్మం జిల్లా కుసుమంచి సెక్షన్   ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, పొలిశెట్టి గూడెంలో కొన్ని నెలలుగా స్మగ్లర్లు శివ, బీకులు నరికివేస్తున్నారు. మన్నెగూడెం మధుకాన్ క్వారీ, కాంపల్లి జోసెఫ్  క్వారీల దగ్గర డంపింగ్ అడ్డాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కర్రను లారీల్లోకి రాత్రి వేళల్లో లోడింగ్ చేయడానికి ఒక్కొక్క కూలికి రోజుకు రూ.2 వేలు స్మగ్లర్లు చెల్లించినట్టు సమాచారం. లోడింగ్ చేసేందుకు ప్రత్యేకంగా బీహార్ నుంచి కూలీలను తీసుకొచ్చి, మన్నెగూడెంలో షెల్టర్ కల్పించినట్టు తెలిసింది.  గత ఐదారు నెలల్లో దాదాపు రూ. 4కోట్ల విలువైన 100 ట్రక్కుల సండ్ర కలపని ఇక్కడ నుంచి తరలించినట్టు సమాచారం.

సండ్ర కలపకు మస్తు డిమాండ్..

సండ్ర కర్ర ను గుట్కా, పాన్ మసాలా, పాన్ లలో వాడే కత్తా తయారీలో ముడి సరుకుగా వాడతారు. వీటి పరిశ్రమలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ కర్రకు మన రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. ఇక్కడ సస్పెండ్  అయిన బీట్ ఆఫీసర్, డోర్నకల్ కు చెందిన సెక్షన్ ఆఫీసర్ కలిసి పనిచేసిన పరిచయం, అనుభవం ఉంది. డోర్నకల్ స్మగ్లర్లకు కర్ర నరికేందుకు సెక్షన్ ఆఫీసర్, రేంజర్, నరికిన కర్రకు ఫేక్ ఎన్ ఓసీలు ఇచ్చేందుకు బీట్​ ఆఫీసర్లు  రూ.లక్షల్లో మామూలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కూసుమంచి సెక్షన్ ఆఫీసర్ కూడా ఇదే పద్ధతిని కొనసాగించినట్లు  ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.