కృష్ణమ్మ ఒడిలోకి  సంగమేశ్వరుడు

కృష్ణమ్మ ఒడిలోకి  సంగమేశ్వరుడు
  •     నాలుగు నెలల పాటు జలగర్భంలోనే ఆలయం
  •     సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు

వనపర్తి, వెలుగు : ఎగువన కర్నాటక రాష్ట్రం నుంచి  వరద వస్తుండడంతో మరికొద్ది రోజుల్లో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం మునిగిపోనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జూరాల నిండి నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం జలాశయం నిండుతూ వస్తోంది. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో కృష్ణానది బ్యాక్ వాటర్ లో వందలాది గ్రామాలు నీట మునిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోని పురాతన ఆలయం సంగమేశ్వర క్షేత్రం  కూడా ఇందులో ఒకటి. అనేక గ్రామాలను మునక నుంచి తప్పించి కృష్ణానది తీరాల్లోని గ్రామాల్లో అప్పట్లో పునర్నిర్మించారు.

అయితే సంగమేశ్వర ఆలయాన్ని మాత్రం అలాగే వదిలేయడంతో ప్రతి సంవత్సరం కృష్ణానదికి వరద వచ్చి శ్రీశైలం డ్యాం నిండగానే బ్యాక్​ వాటర్​లో కృష్ణమ్మ ఒడిలో మునిగి పోతుంది. ఆ తర్వాత నీళ్లు తగ్గి కొంచెం కొంచెంగా బయటపడుతూ వస్తుంది. ఇక్కడ శివలింగాన్ని అర్జునుడు ప్రతిష్ఠించినట్టు చెప్తారు.  ఏడు నదులు కలిసే సంగమ ప్రదేశంలో  ఉండడం వల్ల సంగమేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ భక్తులకు ఆరాధ్య దైవంగా ఇక్కడి శివుడిని భక్తులు కొలుస్తారు.  

నీళ్లలోనే పూజలు

రాయితో కాకుండా చెక్క ఆకారంలో ఉండే శివలింగాన్ని వేపదారు శివలింగం అని ఇక్కడి భక్తులు చెబుతున్నారు.  జూలై, ఆగస్టులో  నీటిలో  మునగడం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నదీ గర్భం నుంచి బయటపడడం  ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కృష్ణమ్మకు వరదలు రాగానే భక్తులు నీళ్లల్లో వెళ్లి అతి కష్టం మీద చివరి పూజలు చేసి స్వామికి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత శివరాత్రి నాటికి మళ్లీ ఆలయం జల దిగ్భందం నుంచి  బయటపడడంతో పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జూరాల నిండి నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం జలాశయం నిండుతూ వస్తోంది.

నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలాల సమీపంలో ఉన్న ఈ ఆలయానికి  పుట్టి ద్వారా వెళ్లి భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్వాల జిల్లా ముచ్చుమర్రి గ్రామం నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా మునుగుతూ గురువారం నాటికి కేవలం ఆలయం గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి.