Team India Coach : ప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో దూసుకుపోతోంది. కానీ భవిష్యత్తులో భారత్ కి టీ20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను ఎంపిక చేయాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ఐపీఎల్‌లో గుజరాత్ ని ఆయన నడిపిస్తున్న తీరు, ప్లేయర్స్ ని హ్యాండిల్ చేసే విధానాన్ని నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. . గంభీర్ తర్వాత ఇండియా టీ20 జట్టు బాధ్యతలను నెహ్రాకు అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మంజ్రేకర్ వెల్లడించారు.
గుజరాత్ టైటాన్స్ వెనుక నెహ్రా శ్రమ:
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సాధించిన రికార్డులే ఆశిష్ నెహ్రా కోచింగ్ సామర్థ్యానికి ప్రత్యక్ష నిదర్శనం.. 2022లో కొత్తగా ఐపీఎల్ లోకి అడుగు పెట్టిన ఫ్రాంచైజీని తన తొలి సీజన్ లోనే ఛాంపియన్‌గా నిలిపి అందరినీ షాక్ కి గురి చేసింది. అనంతరం 2023లో కూడా వరుసగా రెండోసారి ఫైనల్ చేరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోగా, ఐపీఎల్ 2026లో సైతం నెహ్రా డైరెక్షన్స్ లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో తృటిలో టైటిల్ మిస్ చేసుకుంది. 2024 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వదిలేసిన తర్వాత కూడా.. గుజరాత్ ఇప్పటికీ మార్కెట్లో అత్యంత బలమైన శక్తిగా కొనసాగడం వెనుక ఆశిష్ నెహ్రా శ్రమ ఎంతో ఉంది.
నెహ్రాపై మంజ్రేకర్ ప్రశంసలు:
గుజరాత్ కోచ్ నెహ్రాపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. ఆశిష్ నెహ్రా పక్కా ప్రాక్టికల్‌గా ఆలోచించే స్ట్రీట్ స్మార్ట్ ఆటగాడు.. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడితే ఎక్కడా కూడా ఎమోషనల్ అయ్యే వ్యక్తి కాదు.. జట్టులో ఉన్న లోపాలు ఏంటి, వాటిని ఎలా సరి చేయాలనే దానిపై ఫోకస్ పెడతాడు.. ఎవరినో సంతోష పెట్టడానికో లేదా జట్టులో తన స్థానం కాపాడుకోవడానికో రాజకీయం చేసే వ్యక్తి మాత్రం కాదు.. ప్లేయర్స్ కు కూడా కోచ్‌లోని ఈ నిజాయితీ తెగ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. కోచ్‌గా సక్సెస్ వచ్చినా నెహ్రా ఎప్పుడూ క్రెడిట్ కోసం చూడలేదని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
వస్తే హెడ్ కోచ్‌గానే రావాలి:
సాధారణంగా మాజీ ఫాస్ట్ బౌలర్లను టీమిండియాకు బౌలింగ్ కోచ్‌లుగా ఎంపియక చేయడం మనం చూస్తుంటాం.. కానీ ఆశిష్ నెహ్రా విషయంలో మాత్రం అలా చేయొద్దని మంజ్రేకర్ తేల్చి చెప్పాడు. ఐపీఎల్‌లో వేర్వేరు కెప్టెన్లతో జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన ట్రాక్ రికార్డు నెహ్రాకు మాత్రమే ఉంది.. కాబట్టి, అతడ్ని బౌలింగ్ కోచ్‌గా పిలవడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీసీసీఐ టీ20 స్పెషలిస్ట్ కోచ్‌ను పెట్టాలనుకుంటే నెహ్రాను నేరుగా ప్రధాన కోచ్ పదవికే తీసుకోవాలని మంజ్రేకర్ సూచించారు.
