Sankranti Special : సంక్రాంతి పండుగ రోజు.. బెల్లం పొంగలి నీతి కథ

Sankranti Special : సంక్రాంతి పండుగ రోజు.. బెల్లం పొంగలి నీతి కథ

గుడిసెలోకి వచ్చిన మల్లీశ్వరితో “ఈ సంక్రాంతికి బెల్లం పొంగలి చెయ్యాలేమోనని బాధగా వుంది” అంది అవ్వ. " అవ్వా, నువ్వు ఊరి వాళ్లందరికీ విస్తరాకులు కుట్టిస్తున్నావు. అందుకు సంక్రాంతి పండుగ టైంకి మనకు బియ్యం, పప్పు, బెల్లం ఇస్తున్నారు కదా” అంది మల్లీశ్వరి. “అవును అందరూ బియ్యం, పప్పు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు బెల్లం ఎవరూ ఇవ్వలేదు. మన ఊళ్లో ఈ సారి చెరకు పంట వెయ్యలేదంట” అంది బాధగా. “అయితే వాళ్లంతా ఈ సంక్రాంతి రోజున బెల్లం పొంగలి చేసుకోరా?” అడిగింది మల్లీశ్వరి. 

“ఎందుకు చేసుకోరు? వాళ్లంతా పండుగ రోజుకి కావలసిన బెల్లం జాగ్రత్తగా ఉంచుకున్నారు"అంది అవ్వ. “అవునులే... మన కష్టానికి తగ్గట్టు బియ్యం, పప్పులు ఇచ్చారు. అందుకని మళ్లీ బెల్లం కావాలని వాళ్లని అడగడం మర్యాదకాదు. నేనెలాగైనా బెల్లం తీసుకొస్తాను”అని అవ్వ కుట్టిన విస్తరాకులు తీసుకొని పక్క ఊళ్లో ఉన్న చెరకు రైతు దగ్గరకెళ్లింది మల్లీశ్వరి. విస్తరాకులు తీసుకుని కొంచెం బెల్లం ఇవ్వడంని అడిగితే “ఉన్న బెల్లం అంతా అమ్మేశాము” అన్నాడు. 

ఆ ఊరి కిరాణా కొట్టు దగ్గరకెళ్ళి అడిగితే లేదన్నాడు. దాంతె ఇంటికి వచ్చిన మల్లీశ్వరి ఏం చేయాలా అని ఆలోచించింది. ఉదయాన్నే లేచి అవ్వతో కలిసి బియ్యం పిండితో ముగ్గువేసింది. కొంతసేపటికి చీమలు వచ్చాయి. వాటితో “చీమలూ ...చీమలూ బెల్లం పొంగలి చేయడానికి కొద్దిగా బెల్లం తెస్తారా" అని అడిగింది మల్లీశ్వరి. “మాకు చేస్తున్న సాయానికి కొండంత బెల్లం ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం. మీరు పేదవాళ్లయినా మాకోసం బియ్యాన్ని పిండి చేసి, ఆ పిండితో ముగ్గులు వేస్తున్నారు. పుట్టలో బియ్యప్పిండి అయితే జాగ్రత్తగా దాచుకున్నాం. కానీ మాదగ్గర బెల్లం లేదు”అని బాధగా చెప్పింది రాణి చీమ. తరువాత కాకుల దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పింది రాణి చీమ. 

“అవును... వాళ్ళు చాలా మంచివాళ్లు. ప్రతిరోజు అన్నం తినేముందు మా కోసం ఒక పిడికెడు అన్నం పెడతారు మాకు" అన్నాయి కాకులు. ఆ తరువాత బెల్లం తయారుచేసే చోటుకెళ్ళి ఒక్కొక్క బెల్లం ముక్క నోట కరచుకుని వచ్చి, అవ్వ గుడిసె ముందు ఉంచాయి కాకులు. ఈలోపు రాణి చీమ మిగతా చీమలన్నింటికీ అవ్వ ఇంటిముందు ఉన్న బెల్లం దగ్గరకు వెళ్లొద్దని చెప్పింది. 

అవ్వ ఇంటిముందు గుంపులుగుంపులుగా చీమలున్నా ఒక్క చీమా బెల్లం ముక్కల దగ్గరకి వెళ్లలేదు. అదిచూసి ఆశ్చర్యపోయింది మల్లీశ్వరి. సంక్రాంతి పండుగ రోజు ఉదయాన ముగ్గులు వేసేటప్పుడు చుక్కలు బదులుగా బెల్లం ముక్కలు పెట్టింది. అవ్వ బెల్లం పొంగలి చేసింది. పొంగలి తినేముందు ఒక పిడికెడు తీసి కాకుల కోసం చెట్టుకింద ఉంచింది. కాకులు 'కావ్.. కావ్..' మంటూ తినడం, చీమలు బియ్యం పిండితో పాటు బెల్లం ముక్కలను తీసుకొని పుట్టలోకి వెళ్లడం చూస్తూ అవ్వ, మనవరాలు సంబుర పడ్డారు. - ఓట్ర ప్రకాష్ రావు