మత్తూర్ను బతికిస్తున్న సంస్కృతం

మత్తూర్ను బతికిస్తున్న  సంస్కృతం

కర్ణాటకలోని ఒక ఊరు సంస్కృత భాషని బతికిస్తోంది. ఆ ఊరి పేరు.. మత్తూర్. అక్కడి వాళ్లకి వేరే భాషలు వచ్చినా.. సంస్కృతంలో మాట్లాడటానికే ఇష్టపడతారు. ఆ భాష మాట్లాడటంలో తెలియని ఆనందం ఉందంటారు వాళ్లు. 

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న మత్తూర్​లో సంస్కృతం వాడుక భాష. దాదాపు ఐదువేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో సంస్కృతంలో మాట్లాడుకుంటారు. ఆడవాళ్ల ముచ్చట్లు, పిల్లలను తిట్టే తిట్ల నుంచి బిజినెస్​ విషయాలు.. అన్నీ సంస్కృతంలోనే. అంతెందుకు..మామూలుగా ఏ భాష  మాట్లాడేటప్పుడైనా కొన్ని ఇంగ్లీష్​ పదాలు వాడతారు. కానీ..వీళ్లు మాత్రం పొరపాటున కూడా ఇంగ్లీష్​ పదం వాడరు. చదువుతో సంబంధం లేకుండా ఎనిమిదేండ్ల వయసు నుంచే పిల్లలకి సంస్కృత శ్లోకాలు నేర్పించడమే ఇందుకు కారణం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సంస్కృతంలోనే ఉంటాయి. కాబట్టి, వాటిని నేర్చుకున్న వీళ్లు కూడా దేవ భాషలోనే మాట్లాడుకుంటుంటారు. ఆ ఊళ్లో ఉన్నవాళ్లే కాదు..అక్కడ చదువుకుని వేరేచోట ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా తమ వాళ్లతో ఫోన్​లో మాట్లాడాలన్నా, సొంతూరుకి వచ్చినా.. సంస్కృతంలోనే మాట్లాడతారు. అయితే ఆ ఊళ్లోకి ఎవరైనా బయటివ్యక్తులు వస్తే వాళ్లకి సంస్కృతం అర్థం కాదు కనుక వాళ్లతో కన్నడ, ఇంగ్లీష్​, హిందీ మాట్లాడతారు. 

మొదట్నించీ లేదు.. 
ఈ ఊళ్లో వాళ్లంతా కర్ణాటక వాళ్లు కాదు. కేరళ నుంచి ఒక తెగ ఈ గ్రామానికి దాదాపు 600 ఏండ్ల కిందట వలస వచ్చారు. వాళ్లంతా బ్రాహ్మణ ఆచారం పాటిస్తారు. మత్తూర్​కి వచ్చిన వాళ్లు ఇక్కడే ఒక స్కూల్ కట్టుకున్నారు. అందులో సంస్కృతం మెయిన్​ సబ్జెక్ట్. ఇదిలా ఉండగా 1981లో సంస్కృత భాషను ప్రోత్సహించడానికి ‘సంస్కృత భారతి’ అనే సంస్థ ప్రతినిధి ఇక్కడికి వచ్చాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోలాగే మత్తూర్​లో కూడా సంస్కృత భాష గొప్పతనం గురించి చెప్పాడు. పదిరోజులు జరిగిన ఈ వర్క్​షాప్​లో ప్రజలు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఆ క్లాసులు విన్న తర్వాత మత్తూర్ ప్రజలకు ఆ భాషను బతికించుకోవాలనే ఆశ మొదలైంది. అప్పటి నుంచి సంస్కృతాన్ని వాళ్ల లైఫ్​ స్టైల్​లో భాగం చేసుకున్నారు. అలా వాళ్లతోపాటు ఇతర వర్గాల ప్రజలు కూడా సంస్కృతంలోనే మాట్లాడటం మొదలైంది. మత్తూర్ ప్రజలు ఒక్క సంస్కృతంలోనే కాదు, వాళ్లు చదువుకునే వేరే సబ్జెక్ట్స్​​లో కూడా టాపర్సే. అందుకు కారణం కూడా సంస్కృతమేనట! ఎందుకంటే సంస్కృతం నేర్చుకోవడం వల్ల వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడంలో మంచి పట్టు సాధిస్తారు. అది మిగతా సబ్జెక్ట్స్ ‌‌లో కూడా వాళ్లకి ఉపయోగపడింది. ఇక్కడ సంస్కృత భాషతోపాటు ‘గమకం’ కూడా సజీవంగా ఉంది. గమకం అంటే... సంగీతంలోని సప్తస్వరాల్లో ఏ స్వరమైనా ముందు వెనక స్థానాలతో కలిసి నడవడం. కథలు చెప్పేటప్పుడు అక్కడి వాళ్లు దీన్ని ఎక్కువగా వాడతారు. 

కవల పల్లె హోసహళ్లి
మత్తూర్​లో చూడటానికి రామాలయం, శివాలయం వంటి టెంపుల్స్ తప్ప టూరిస్ట్​ అట్రాక్షన్స్ ఏం ఉండవు. కానీ.. ఈ ఊరి గురించి తెలుసుకున్న వాళ్లు ఒక్కసారైనా ఊరిని చూడాలని, దగ్గర ఉండి వాళ్లు సంస్కృతంలో మాట్లాడుతుంటే వాళ్ల మాటలు వినాలని అనుకుంటారు. అయితే, మత్తూర్​కు వెళ్లినవాళ్లు దగ్గర్లో  తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హోసహళ్లి చూసి తీరాల్సిందే. హోసహళ్లి పల్లె, నది అందాలు చూడచక్కగా ఉంటాయి. పైగా మత్తూర్​ను చూసి స్ఫూర్తి పొందింది హోసహళ్లి. అక్కడి ప్రజలు కూడా కొన్నేండ్లుగా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. ‘సంస్కృత భాషలో మాట్లాడడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంద’ని చెప్తున్నారు అక్కడి వాళ్లు.