నేడు గద్దెలపైకి సారలమ్మ

నేడు గద్దెలపైకి సారలమ్మ

మేడారం మహాజాతరలో తొలి ఘట్టం గద్దెలపైకి సారలమ్మ రావడం. బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మవారి ప్రతిరూప మైన పసుపు, కుంకుమ తీసుకుని మేడారానికి బయలుదేరుతారు. మేడారంలోని సమ్మక్క గుడి​ వద్ద పగిడిద్దరాజు, సమ్మక్క పెండ్లి జరుగుతుంది. తర్వాత సారలమ్మ గద్దెపై కొలువుదీరుతుంది.  పగిడిద్దరాజు పూనుగొండ్లలో, గోవిందరాజులు కొండాయిలో కొలువై ఉన్నారు. వీళ్లిద్దరినీ బుధవారమే గద్దెకు తీసుకొస్తారు. 

గురువారం: సమ్మక్క తల్లి రాక 

రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి మూడు రౌండ్లు పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లు  సంకేతాలి స్తారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.

 శుక్రవారం: మొక్కుల సమర్పణ 

మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు దీరి భక్తులకు దర్శన మిస్తారు.  భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడి బియ్యం, బంగారమని పిలిచే బెల్లం సమర్పిస్తారు

శనివారం: వన ప్రవేశం 

నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి తీసుకెళ్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక జరుగుతుంది. వేడుక మొత్తం వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే నిర్వహిస్తారు.