నిర్మల్, వెలుగు: ఎస్సారెస్పీ ద్వారా యాసంగి పంటల కోసం సరస్వతి కాల్వకు వారబందీ పద్దతిలో నీరందించనున్నారు. ఏటా యాసంగిలో ప్రాజెక్టు నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి కేటాయింపులో అన్యాయం చేయొద్దని ఏటా కడెం, సదర్మాట్ఆయకట్టు రైతులు ఆందోళన చేస్తున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వల కన్నా.. సరస్వతి ఆయకట్టుకు తక్కువ నీరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కడెం, సదర్మాట్ ఆయకట్టు కొంతమేర ఎండిపోతోందని పేర్కొంటున్నారు.
రైతుల అసంతృప్తి...
కడెం, సరస్వతి కాల్వకు యాసంగిలో తక్కువ నీటిని కేటాయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిగతా కాల్వలకు మాత్రం ఆఫీసర్లు సరిపడు నీరిస్తున్నారని పేర్కొంటున్నారు. సరస్వతి కాల్వ ఆయకట్టుకు న్యాయం చేయాలని ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక్కడి రైతులకే నీరందించలేని ప్రభుత్వం.. ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ నీటిని మహారాష్ట్రకు ఎట్ల ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
సరస్వతి కాల్వకు 5.5 టీఎంసీలు..
ఎస్సారెస్పీ ఆఫీసర్లు సరస్వతి కాల్వకు యాసంగిలో 5.5 టీఎంసీ నీటిని విడుదల చేస్తామన్నారు. దశలవారీగా పంట పొలాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆన్ ఆఫ్ సిస్టం అమలు చేస్తామన్నారు. పది రోజులపాటు రెగ్యూలర్గా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఐదు రోజు లపాటు కాల్వ పరిధిలోని ఉపకాల్వల షెటర్లను మూసి రోజూ 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. ఐదు రోజుల తర్వాత నీటిని నిలిపివేయనున్నారు. ఈసారి రబీ కోసం ఎస్సారెస్పీ నుంచి కడెం ప్రాజెక్టుకు 0.5 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే ఎస్సారెస్పీలో పుష్కలంగా నీరుందని.. నిరాటంకంగా నీటిని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
