బాసర భక్తజన సంద్రం

బాసర భక్తజన సంద్రం
  •     సరస్వతీదేవి క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
  •     ఒక్కరోజే 80 వేల మంది దర్శనం
  •     అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం

భైంసా, వెలుగు : నిర్మల్ ​జిల్లా బాసరలోని చదువుల తల్లి సరస్వతీదేవి క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర నుంచి వేలాదిగా తరలివచ్చారు. మంగళవారం రాత్రే దాదాపు 50 వేల మంది భక్తులు బాసరకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే పిల్లలతో అక్షరశ్రీకార పూజలు చేయించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి, అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో వేచి ఉండలేక చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఒక్కరోజే 80 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వసంత పంచమి సందర్భంగా ముందుగా గర్భగుడిలోని అమ్మవారికి అర్చకులు 108 కలశాలతో అభిషేకం చేశారు.

చేనేత పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి ఏటా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆమె పర్యటన క్యాన్సిల్​అయింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే రామారావు పటేల్, దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ జ్యోతి పట్టు వస్త్రాలు సమర్పించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. అక్షరాభ్యాసాలు, మండప ప్రవేశం, అభిషేకం, లడ్డూ ప్రసాదాల విక్రయం కలిపి మొత్తం కలిపి రూ.61లక్షల92 వేల 950 వచ్చినట్లు ఈవో తెలిపారు.